తెలంగాణలో త్వరలో ఎవరి సత్తా ఎంతో తేలిపోనుంది!

Update: 2019-08-26 06:11 GMT
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ భారీ విజయం సాధించినా ఆ తరువాత కొద్ది నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. కాంగ్రెస్ నాలుగు ఎంపీ సీట్లు - బీజేపీ కూడా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణలో బలపడడంపై ఎంతోకొంత ఆశతో ఉంది. అదే సమయంలో బీజేపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణను పూర్తిగా కమ్మేయాలని అనుకుంటోంది. పైగా ఆ పార్టీ సీనియర్ లీడర్ - మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా ఉండడంతో తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతూ వస్తోంది. పోయిన బలాన్ని తిరిగి కూడగట్టుకోవడానికి టీఆరెస్ - కొత్త బలం చిక్కించుకుని పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న వేళ మధ్యలో మనుగడ పోరాటం చేస్తున్న కాంగ్రెస్... అన్నిటికీ ప్రతిష్ఠాత్మకంగా నిలవబోయే ఎన్నిక ఒకటి త్వరలో రాబోతోంది. అదే హుజూర్ నగర్ ఎన్నిక.

వచ్చే అక్టోబర్ నెలలో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు కు ఉప ఎన్నిక జరగనుండడంతో - ఆ సీటును కైవశం చేసుకునేందుకు టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. హుజూర్‌ నగర్ అసెంబ్లీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి లోక్‌ సభ ఎన్నికల్లో నల్లగొండ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. దీంతో హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి హుజూర్‌ నగర్‌ లో పాగావేయాలని టీఆర్ ఎస్ ఉవీళ్లూరుతుండగా... తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేసి గెలిచి చూపించాలని.. తెలంగాణలో కొత్త శక్తి తామేనని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నట్లుగా సమాచారం. టీఆర్ ఎస్‌ కు తమ పార్టీ ప్రత్యామ్నాయమని చెప్పేందుకు బీజేపీ దీన్ని సరైన అవకాశంగా వాడుకోవాలని అనుకుంటోంది.

లోక్‌ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఒక ఉప ఎన్నిక జరగబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన టీఆర్ ఎస్ - అనేక కారణాల వల్ల లోక్‌ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిలేకపోయింది. పైగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సిటింగ్ సీటు కావడంతో ఇక్కడ కూడా పాగా వేసి తమ బలాన్ని చూపించాలని టీఆర్ ఎస్ తాపత్రయపడుతోంది. గత ఎనిమిది నెలల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వమంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని - తమ ఆగ్రహాన్ని ఈ ఎన్నికల ద్వారా చూపిస్తారని బీజేపీ - కాంగ్రెస్ నేతలు గంపెడాశలతో ఉన్నారు. ఈ ఉప ఎన్నిక వల్ల టీఆర్ ఎస్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా - ఇక్కడ గెలిచి తమ సత్తా చాటడం వల్ల మానసికంగా తమ ఆధిపత్యాన్ని చాటవచ్చని బీజేపీ నేతలంటున్నారు.

హుజూర్‌ నగర్‌ లో వాస్తవానికి కాంగ్రెస్‌ కు మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి 29వేల ఓట్లతో గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి 24వేల ఓట్లతో - 2018 ఎన్నికల్లో 7వేల మెజారిటీతో నెగ్గారు. మరి... ఈసారి ఉప ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

   

Tags:    

Similar News