2022 రౌండప్ : టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. ఎత్తుపల్లాల ప్రయాణం

Update: 2022-12-23 15:30 GMT
'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన.. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక్కడివాళ్లకే దక్కాలి..' అన్న నినాదంతో ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్).  ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకమైన టీఆర్ఎస్ ఏర్పడి 22 ఏళ్లు అవుతోంది.. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా అవతరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రెండుసార్లు అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు దేశంలోనూ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే 2021 ఎండింగ్ నుంచి 2022  సంవత్సరం మొత్తం గులాబీ పార్టీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంది. కేసీఆర్ ప్రభుత్వంలోని లోపాలను ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. దీంతో టీఆర్ఎస్ పై అసంతృప్త జ్వాలలు నెలకొంటున్నాయి.  ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీ గెలిచినా సంతృప్తి మెజారిటీ రాకపోవడమే అందుకు నిదర్శనం.  ఈ నేపథ్యంలో 2022లో టీఆర్ఎస్ ఎత్త పల్లాల గురించి తెలుసుకుందాం..

-కేంద్రంపై పోరుతో మొదలు..
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరు పెట్టుకోవడంతో టీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. 2021 డిసెంబర్లో వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆందోళన చేశారు.  ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తరుపున ధాన్యం కొనుగోళ్లు చేపట్టలేదు. అయితే కేంద్రం బాయిల్డ్ రైస్ కొనమని, రా రైస్ ను మాత్రమే కొనుగోలు చేస్తామని  తేల్చడంతో  పాటు కేసీఆర్ నిరసనను పట్టించుకోలేదు. చివరికి ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ వివాదంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కేసీఆర్ పై వారిలో అసహనం పెరిగింది.

-గవర్నర్ కు అవమానం..
కేంద్రంతో ధాన్యం కొనుగోళ్లపై ఏర్పడిన వివాదం కారణంగా ఆ పార్టీకి చెందిన రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కేసీఆర్ అవమానించారు. జనవరి 26న రాజ్ భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం ఉన్నా హాజరు కాలేదు. అంతేకాకుండా సీఎస్ తో సహా అధికారులను వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా మేడారం వెళ్లడానికి గవర్నర్ కు హెలీక్యాప్టర్ ను ప్రభుత్వం తరుపున కేటాయించలేదు. దీంతో గవర్నర్ రోడ్డు మార్గాన వెల్లి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు.  ఇక గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు.

-హార్డ్ కామెంట్స్ తో హల్ చల్..
అప్పటి వరకు కాస్త సాఫ్ట్ కామెంట్ చేసిన కేసీఆర్ ప్రధాని మోదీతో సహా ఇతర వ్యక్తులపై పరుష వ్యాఖ్యలు చేసి హల్ చల్ చేశారు.  కొన్ని సార్లు నిర్వహించిన ప్రెస్ మీట్లో బొక్కలు ఇరగ్గొడుతా.. ముండ.. రండ.. అంటు కామెంట్స్ చేయడంపై ప్రజల్లో అసహనం పెరిగింది.  అయితే ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ సైతం హార్డ్ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో  ప్రభుత్వంలోని వ్యక్తులు ఇలాంటి పదాలు వాడడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

-ప్రొటోకాల్ పట్టించుకోకుండా..
రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాష్ట్రముఖ్యమంత్రులు ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం  అవేమీ పట్టించుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు మూడు సార్లు వచ్చారు. కానీ ఒక్కసారి కూడా కేసీఆర్ ప్రధానిని ఆహ్వానించలేదు. కొన్ని సార్లు జ్వరం అంటూ తప్పించుకున్నారు. కేంద్రంతో రాజకీయంగా విభేదాలే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి పనులపై కేంద్రాన్ని కలిసింది లేదు. ఇలాంటి విషయాలపై ప్రతిపక్ష బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.

-గెలిచినా అసంతృప్తే..
నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈ గెలుపు సంతృప్తి కరంగా లేదు. ఎందుకంటే 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ స్వయంగా ప్రచారం చేశారు. అయినా 10 వేల మెజారిటీతో గెలుపొందడంపై టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతే అని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఇక్కడ ఉప ఎన్నిక సందర్భంగా గొర్రెల పథకానికి గొర్లను బదులు నగదు బదిలీ చేస్తామన్నారు.  కానీ గెలిచిన తరువాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో కేసీఆర్ పై ఓ వర్గం అసహనంగా ఉంది.

-బీఆర్ఎస్ పయనం మొదలు..
తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులు దేశవ్యాప్తంగా చేస్తానని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. దీనికి  డిసెంబర్ 8న ఈసీ కూడా అనుమతులుజారీ చేసింది. వెంటనే ఆనెల 14న ఢిల్లీలో యాగంతో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.  22న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు.  కొన్నిరోజుల్లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు.

2022 సంవత్సరం మొత్తం టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారడం.. మునుగోడులో విజయం తప్పితే.. ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ గా దేశంలో కీలక శక్తిగా మారుతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మరి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News