కేసీఆర్‌ కు అస‌ద్ ఫోన్.. మ్యాట‌ర్ ఇదేన‌ట‌!

Update: 2018-12-10 04:43 GMT
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు.. మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీకి మ‌ధ్య‌నున్న జానీ జిగ్రీ దోస్తానా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఓటుకు నోటు టైంలో కేసీఆర్  స‌ర్కార్ కు దిమ్మ తిరిగే తీరులో ప్లాన్ చేయ‌టం.. దానికి సంబంధించిన లోగుట్టు స‌మాచారాన్ని త‌న‌కు అస‌దే ఫోన్ చేసి చెప్పిన వైనాన్ని కేసీఆర్ ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్ప‌టం తెలిసిందే. త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడిన అప‌ద్బాంధ‌వుడిగా అస‌ద్ ను కేసీఆర్ కీర్తిస్తుంటారన్న విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. బాబుకు దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు అస‌ద్ స‌మాచారం త‌న‌కు ప‌నికి వ‌చ్చింద‌న్న భావ‌న ఉంద‌ని చెబుతారు. అందుకే.. ఎవ‌రి మాట విన‌ని కేసీఆర్‌.. అస‌ద్ ఏదైనా చెబితే విన‌ట‌మే కాదు.. సానుకూలంగా స్పందిస్తార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ కార‌ణం చేత‌నే కేసీఆర్ చేత ఏదైనా కీల‌క‌మైన ప‌ని చేయించుకోవాల‌న్నా.. టికెట్ల ఇష్యూ మాట్లాడాల‌న్నా అస‌ద్ ఛాన‌ల్ కు మించింది మ‌రొక‌టి లేద‌న్న అభిప్రాయాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తుంటాయి.

ఇదిలా ఉంటే.. ఎన్నిక‌లు ముగిసిన వేళ‌.. గెలుపు ధీమాను ఎవ‌రికి వారు ప్ర‌క‌టిస్తున్న వేళ‌లో కేసీఆర్‌ కు అస‌ద్ ఫోన్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. భారీగా పోలైన ఓట్ల‌తో తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న సందేహాల్ని ప‌క్క‌న పెడితే.. కేసీఆర్ కు ఫోన్ చేసిన అస‌ద్‌.. మెజార్టీ స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు గెల‌వ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన మెజార్టీని సొంతం చేసుకుంటార‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

ఎన్నిక‌ల్లో కేసీఆర్ అనుస‌రించిన వ్యూహం ఫ‌లించింద‌ని.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజార్టీకి మించిన సీట్లు వ‌స్తాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ముంద‌స్తు అభినంద‌న‌లు కూడా చెప్పారు. ఎన్నిక‌ల పోలింగ్ తో పాటు.. ఓట‌రు నాడి ఎలా ఉంటుంద‌న్న విష‌యాల మీద కూడా వారు మాట్లాడుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ పార్టీకి మ‌జ్లిస్ మ‌ద్ద‌తు ఇవ్వ‌టంపై సంతోషం వ్య‌క్తం చేసిన కేసీఆర్‌.. అస‌ద్‌ కు థ్యాంక్స్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమ‌వారం) కేసీఆర్‌.. అస‌ద్‌ లు భేటీ కానున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. మైనార్టీల ఓట్లు టీఆర్ ఎస్‌ కే ప‌డ్డాయ‌ని.. రాష్ట్రంలో గులాబీ హోరు మారుమోగ‌నున్న‌ట్లుగా చెప్పారు.


Tags:    

Similar News