ప‌న్ను మాట‌తో మోడీకి షాకిచ్చిన ట్రంప్!

Update: 2019-03-03 08:05 GMT
ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌తి ఒక్క అంశం అంతో ఇంతో ప్ర‌భావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే ఎన్నిక‌ల వేళ‌.. వీలైనంత ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవ‌టం క‌నిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విష‌యాలు మోడీ మాష్టారికి తెలియ‌నివి కావు. అందుకే ఆయ‌న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల వ్య‌వ‌హారం రోజుల్లోకి వ‌చ్చేసిన వేళ‌.. కీల‌క నిర్ణ‌యాల్ని చ‌క‌చ‌కా తీసేసుకుంటున్నారు.

త‌న‌కు సానుకూల వాతావ‌ర‌ణాన్ని సిద్ధం చేసుకుంటున్న ఆయ‌న‌కు అనుకోని రీతిలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఊహించ‌ని రీతిలో ప‌న్ను దెబ్బేశారు. అది కూడా మోడీ చేసిన దానికి ప్ర‌తిగా అంటూ పేరు చెప్పి మ‌రీ ప‌న్ను వేశారు. తాజాగా జ‌రిగిన స‌ద‌స్సులో మాట్లాడిన ఆయ‌న‌.. భార‌త్ లో అత్య‌ధికంగా ప‌న్నులు విదిస్తున్నార‌ని.. వారు మ‌న నుంచి చాలా వ‌సూలు చేస్తున్న‌ట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.

అందుకు ప్ర‌తి చ‌ర్య‌గా తాను కూడా ప‌న్ను విధించాల‌ని నిర్ణ‌యించాన‌ని.. అయితే.. మోడీ మాదిరి వంద శాతం కాకుండా 25 శాతం ప‌న్ను వేయ‌నున్న‌ట్లు చెప్పారు. దీన్ని మిర్ర‌ర్ ట్యాక్స్ అంటార‌ని.. ఇది భార‌త్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌తి చ‌ర్యే అయినా.. మోడీ మాదిరి భారీగా తాను వ‌సూలు చేయ‌టం లేద‌న్నారు.

అంతేకాదు.. మోడీ ఎలాంటి వ‌స్తువుల మీద ప‌న్ను భారీగా బాదేస్తున్నారో.. తానుకూడా అవే వ‌స్తువుల మీద ప‌న్ను వేయ‌నున్న‌ట్లు చెప్పారు. అయితే.. మోడీ మాదిరి వంద శాతం కాకుండా పాతిక శాతం ప‌న్ను విధిస్తున్నా.. సెనేట్లో క‌ల‌క‌లం రేగింద‌ని చుర‌క‌లు వేశారు.

అమెరికా ఉత్ప‌త్తుల మీద మోడీ వేసిన ప‌న్నుల‌కు త‌గ్గ‌ట్లు తాను ప‌న్ను విధించ‌టం లేదు కానీ.. పాతిక శాతం ప‌న్నును విధిస్తున్న‌ట్లు చెప్పారు. వాస్త‌వానికి ఈ జ‌న‌వ‌రిలోనే భార‌త్ ఎగుమ‌తి చేసే ఉత్ప‌త్తుల మీద ప‌న్ను విధించేందుకు ట్రంప్ సిద్ధ‌మ‌య్యారు. కానీ.. వ్య‌తిరేక‌త రావ‌టంతో కాస్త వెన‌క్కి త‌గ్గారు. స‌మ‌యం చూసుకొని ఆయ‌న ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. మ‌రి.. దీనికి మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News