చైనాకు చేత‌కాక‌పోతే రెడీ అంటున్న ట్రంప్‌

Update: 2017-04-03 11:36 GMT
త‌ను ఎంత దూకుడుగా ఉంటానో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు నిరూపించుకున్నారు. ఉత్త‌ర కొరియా అణు కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవ‌డంలో చైనా సాయం చేయ‌క‌పోతే అమెరికానే ఏక‌ప‌క్షంగా ఆ సంగ‌తి చూసుకుంటుంద‌ని ట్రంప్‌ హెచ్చ‌రించారు. ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ఆఫ్ లండ‌న్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ గురు - శుక్ర‌వారాల్లో చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌ పింగ్‌ తో జ‌ర‌గ‌నున్న స‌మావేశానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది.

ఐక్య‌రాజ్య‌స‌మితి, అమెరికాతోపాటు ప‌లు దేశాలు వ‌ద్ద‌ని వారిస్తున్నా.. ఉత్త‌ర కొరియా మాత్రం బాలిస్టిక్ క్షిప‌ణుల ప్ర‌యోగాన్ని మాత్రం ఆప‌డం లేదు. గ‌త ఏడాది కాలంలోనే ఐదు అణు పరీక్ష‌ల‌ను నార్త్ కొరియా నిర్వ‌హించింది. ఈ నేప‌థ్యంలో తాజా ఇంట‌ర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ``ఉత్త‌ర కొరియాపై చైనా ప్ర‌భావం చాలా ఉంది. అందువల్ల ఈ విష‌యంలో చైనా మాకు సాయం చేయాలా వ‌ద్దా అన్న‌ది నిర్ణ‌యించుకోవాలి. వాళ్లు సాయం చేస్తే అది చైనాకే మంచిది. అలా కాక‌పోతే అది ఎవ‌రికీ మంచిది కాదు`` అని ట్రంప్ స్ప‌ష్టంచేశారు. అటు ఐక్య‌రాజ్య‌స‌మితికి అమెరికా రాయ‌బారిగా ఉన్న నిక్కీ హేలీ కూడా నార్త్ కొరియా విష‌యంలో అమెరికా చైనా సాయం తీసుకుంటుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. `నార్త్ కొరియాను ఆపే దేశం ఏదైనా ఉందంటే అది చైనా ఒక్క‌టే. అందుకే ఈ విష‌యంలో మేము చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంటాం` అని హాలే ఏబీసీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె అన్నారు.

ట్రంప్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తొలిసారి చైనా అధ్య‌క్షుడితో జ‌ర‌నున్న ముఖాముఖి స‌మావేశానికి మ‌రింత ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఈ స‌మావేశంలో నార్త్ కొరియాపైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు కూడా హాలే వెల్ల‌డించారు. ఉత్త‌ర కొరియా అణు ప‌రీక్ష‌ల‌తో చైనా కూడా విసుగు చెందింది. ఇప్ప‌టికే ఆ దేశం నుంచి వ‌చ్చే బొగ్గు దిగుమ‌తుల‌ను నిలిపేసింది. అయితే చైనా తీసుకున్న ఈ చ‌ర్య‌లు ఏమాత్రం స‌రిపోవ‌ని హేలీ స్ప‌ష్టంచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News