తెలంగాణలో తప్పినోళ్లంతా పాస్.. వారి విషయంలో మాత్రం సస్పెన్స్

Update: 2020-07-10 05:00 GMT
కరోనా పుణ్యమా అని అరుదైన నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంటోంది. చదువుకునే పిల్లల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరీక్షలు.. పాస్.. ఫెయిల్ లాంటివేమీ లేకుండా వరుస పెట్టి నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరిని పాస్ చేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. ఈ మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన 1.61లక్షల మంది సెకండ్ ఇయర్ పిల్లల్ని పాస్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత శాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.

వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన వారంతా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సిన నేపథ్యంలో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించటం కష్టమన్న విషయంపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో.. పరీక్షలకు హాజరవ్వాలనుకున్న వారందరిని పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పాస్ అయిన విద్యార్థుల మార్కుల మెమోలో కంపార్ట్ మెంటల్ లో పాస్ అయినట్లుగా వెల్లడించనున్నారు.

పరీక్షల్లో ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ విద్యార్థులంతా పాస్ అయినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో తప్పిన విద్యార్థుల మాటేమిటన్న విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సదరు విద్యార్థులకు మరో విద్యా సంవత్సరం ఉన్న నేపథ్యంలో వారు ఫెయిల్ అయిన సబ్జెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జరిగే పరీక్షల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన సబ్జెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ అప్పుడు కానీ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు క్లియర్ చేసుకొని.. ఫస్ట్ ఇయర్ లో తప్పితే మాత్రం విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని చూసినోళ్లంతా తాము కూడా  సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయితే బాగుండని ఫీలైపోతున్నారట. మరి.. అప్పనంగా పాస్ అయితే ఎవరికి మాత్రం అలాంటి ఆశ ఉండదు చెప్పండి.
Tags:    

Similar News