అంతా మీకేనా.? టీటీడీపీలో సీట్లు గొడవ

Update: 2018-10-04 05:25 GMT
ఇప్పటిదాకా స్తబ్దతగా ఉన్న టీ టీడీపీలో  అనుకోని పరిణామం చోటుచేసుకుంది. అనూహ్యంగా జూనియర్లు గళమెత్తారు. తమను పట్టించుకోరా.. ఇన్నేళ్లు ఊడిగం చేసి, ఇప్పడు కూడా ప్రచారానికే పరిమితమవ్వాలా అని ప్రశ్నిస్తున్నారు. తమకు సీట్లను కేటాయంచాలని ఢంకా బజాయించి చెబుతున్నారు.

తెలంగాణ ఆవిర్భావం తరువాత, ఇక్కడ టీడీపీ దాదాపు కనుమరుగయ్యే స్థాయికి చేరుకుంది. చాలా మంది నేతలు అధికార టీఆర్ ఎస్ లో చేరిపోయారు. ఎప్పటి నుంచో పార్టీకి వెన్ను దన్నుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ - మోత్కుపల్లి నర్సింహులు - దయాకర్ రావు లాంటి నేతలు కూడా కారు ఎక్కేశారు. దాంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక పుంజుకోవడానికి సమయం పడుతుందని భావించారు.

కానీ, ఎన్నికల వేళ టీ టీడీపీ మరలా పాత రూపు సంతరించుకునేందుకు చేయాల్సిన అన్ని పనులను చేస్తుంది. టీజేఏసీ - కాంగ్రెస్ లతో కలిసి మహా కూటమిగా ఏర్పడ్డారు. ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా పునర్వైభవం తెచ్చుకోవాలనేది ప్లాన్.  ఇందులో భాగంగా టీడీపీ తప్పక గెలుచుకునే సీట్లను పొందండంపై ప్రధాన దృష్టి  సారించింది. పెద్దిరెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి - వేమూరి ప్రకాష్ రెడ్డి - కొత్తకోట సీత - రావుల చంద్రశేఖర్రెడ్డి ఇలా సీనియర్ నేతలంతా పోటీ చేయబోతున్నారట,

సీట్ల సర్దుబాటు జరిగాక కేటాయించిన స్థానాల్లో పోటీ చేసేందుకు సీనియర్లు రెడీ అవుతున్నారట. అఫీషియల్ గా ప్రకటించకపోయినా - గ్రౌండ్ వర్క్ కొంతమంది మొదలు పెట్టేశారు.  ఈ తరుణంలో అనూహ్యంగా జూనియర్లు గళం విప్పారు.  పొత్తులో భాగంగా 10 నుంచి 15 సీట్లు రావని అంటున్నారు. ఈ సీట్లన్ని సీనియర్లకు ఇచ్చేస్తే తమ సంగతేంటని జూనియర్లు ప్రశ్నిస్తున్నారు. తమకు పోటీ చేయాలని అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.

ఇప్పటి వరకు సవ్యంగా సాగిపోతుందనుకున్న టీటీడీపీ నేతలు ఊహించని అసమ్మతి గళంతో ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్టీలో నూతన ఉత్సాహం - పటిష్టతకు వ్యూహాలు రచిస్తున్న వేళ ఇదేం మెలిక అంటూ వాపోతున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్ నుంచి పోటీచేసేందుకు ప్రణాళిక రచించుకుంటున్నాడట. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారు. ఈ జూనియన్ నేతల తాకిడితో అలెర్ట్ అయిన టీడీపీ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది.
   

Tags:    

Similar News