దిన‌క‌రన్ కొత్త‌పార్టీ..జంప‌య్యే ఎమ్మెల్యేలు ఎవ‌రు?

Update: 2018-03-15 09:40 GMT
అన్నా డీఎంకే బహిష్కృత నేత - ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ రాజీయంగా అనూహ్య నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరం తనకు లేదని కొద్ద‌కాలం క్రితం మీడియాకు తెలిపిన దిన‌క‌ర‌న్ తాన మాట‌ను తానే మార్చుకున్నారు. ఏఐడీఎంకే రెబల్ అభ్యర్థి - ఆర్‌ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ నేడు తన నూతన పార్టీని ప్రకటించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ గా పార్టీ పేరును ప్రకటించారు. పార్టీ గుర్తుగా 'ప్రెషర్ కుక్కర్'.. పార్టీ జెండాగా జయలలిత ఫోటోతో కూడిన జెండాను ఆవిష్కరించారు.

త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌యలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్‌కె నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ బహిష్కృత నేత - శశికళ విధేయుడైన దినకరన్ అనూహ్య మెజారిటీతో విజయం సాధించటం తెలిసిందే. ఏఐడీఎంకే అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి మధుసూదన్‌పై 45వేల మెజార్టీని దినకరన్ సాధించారు. ఇది ఏఐడీఎంకే చీఫ్ జయలలిత పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ. ఈ విజయంతో అటు ఏఐడీఎంకేలో భారీ మార్పులు రాబోతున్నాయని, మూడు నెలల్లో తస్మదీయుల ప్రభుత్వం కుప్పకూలుతుందని దినకరన్ ప్రకటించారు. అనంత‌రం త‌న సొంత పార్టీ ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు చేశారు. మధురైలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దినకరన్ పార్టీ ప్రకటన చేశారు. కార్యకర్తలు - మద్ధతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభా ప్రాంగణంలో జయలలిత - ఎంజీఆర్ - వీకే శశికళల పెద్ద కటౌట్‌ లను ఏర్పాటు చేశారు. రెండాకుల గుర్తుకోసం పోరాటం కొనసాగించనున్నట్లు అంతవరకు ప్రెషర్ కుక్కర్‌ ను పార్టీ గుర్తుగా ఉపయోగించుకోనున్నట్లు దినకరన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా, దిన‌క‌ర‌న్ పార్టీ ఏర్పాటుతో అధికార అన్నాడీఎంకే వ‌ర్గాలు ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు స‌మాచారం. త‌న‌తో క‌లిసి న‌డిచేందుకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నార‌ని కొద్దికాలం క్రితం దిన‌క‌ర‌న్ ప్ర‌క‌టించ‌డం, దానికి కొన‌సాగింపుగా తాజాగా పార్టీ ఏర్పాటును ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మూడునెల‌ల్లో త‌మ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామ‌ని స‌వాల్ విసిరిన దిన‌క‌రన్ తాజాగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News