బైక్ మీదెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేశారు

Update: 2015-07-15 05:49 GMT
వారిద్దరూ రాష్ట్ర మంత్రులు. కీలక స్థానాల్లో ఉన్న వారు.. ఏదైనా సమస్య ఎదురైతే.. అధికార గణాన్ని పంపి.. పరిష్కరాం చేసే ధోరణికి భిన్నంగా వ్యవహరించటమే కాదు.. రాజకీయ నేతలు ఇంత చురుగ్గా ఉంటారా? అనిపించేలా వ్యవహరించి విస్మయానికి గురి చేశారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు.. హరీశ్ రావులు ఇద్దరూ వ్యవహరించిన తీరు పలువురు ప్రశంసలు పొందుతోంది. మంత్రులైన ఈ ఇద్దరూ ఒక సమయంలో ట్రాఫిక్ పోలీసుల మాదిరి వ్యవహరించి.. ట్రాఫిక్ జాంను క్లియర్ చేయటంతో పాటు.. భక్తుల అవస్థల్ని తొలగించిన వైనమిది.

పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని ఐదు జిల్లాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసినా ఖమ్మం జిల్లా భద్రాచలంలో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భద్రాచలం.. సారపాక వంతెనపై ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల తన రాయల్ ఎన్ ఫీల్డ్ పై మంత్రి హరీశ్ ను కూర్చొబెట్టుకొని ట్రాఫిక్ జాం అయిన ప్రాంతానికి వెళ్లారు. వంతెన వద్దకు చేరుకున్న మంత్రులిద్దరూ వాకీ టాకీలు చేత పట్టి.. ట్రాఫిక్ జాం ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.

స్వయంగా మంత్రులే రంగంలోకి దిగటంతో.. ట్రాఫిక్ జాం క్షణాల్లో ఒక కొలిక్కి వచ్చింది. అదే సమయలో.. అక్కడికి చేరుకున్న ఖమ్మం జిల్లా ఎస్పీ  షానవాజ్ ఖాసీంకు ట్రాఫిక్ నియంత్రణకు పలు సలహాలు.. సూచనలు చేసి వెళ్లిపోయారు. ఏదైనా సమస్య ఎదురైతే ఏసీ ఛాంబర్లో కూర్చొని సూచనలు చేయకుండా.. స్వయంగా సమస్య ఉన్న ప్రాంతానికి రెస్య్కూ దళం మాదిరి వెళ్లి ఇష్యూ క్లోజ్ చేసి రావటం గొప్ప విషయమే.
Tags:    

Similar News