మండుటెండ‌ల్లో కోత‌లు త‌ప్ప‌వు?

Update: 2022-04-10 00:30 GMT
ముంద‌స్తు చ‌ర్య‌లు లేవు. పోనీ దిద్దుబాటు చ‌ర్య‌లున్నాయా అంటే అవీ లేవు. ఇక స‌మ‌స్య ప‌రిష్కారానికి నిధులున్నాయా అంటే అవీ లేవు. ప‌రీక్ష‌ల కాలంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎదుర్కొనబోతున్న అత్యంత క్లిష్ట‌మ‌యిన ప‌రీక్ష విద్యుత్ సంక్షోభ నివార‌ణ. కొనుగోలు చేద్దామన్నా విద్యుత్ ఎక్క‌డా దొర‌క‌డం లేద‌ని ఇప్పుడు చెబుతున్నారంటే ముందుగానే ఈ స‌మ‌స్య‌ను అంచ‌నా వేయ‌లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఏమంటే ప‌రిశ్ర‌మ‌ల వినియోగం పెరిగింది.

వ్య‌వ‌సాయంలో బోర్ల వినియోగం పెరిగింది..అని మాత్రం చెబుతారు. వాటి రీత్యా త‌ప్ప తమ వ‌ర‌కూ ఏ త‌ప్పూ లేద‌ని కూడా అంటారు. మ‌రి! గ‌త ప్ర‌భుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల మాటేంటో ? వాటి ర‌ద్దు ఇప్ప‌టి సంక్షోభాన్ని అయితే ప్ర‌భావితం చేయ‌దు..చేయ‌లేదు కూడా ! అన్న‌ది సంబంధిత అధికారుల వాదన.

మ‌న ద‌గ్గ‌ర ఉన్న విద్యుత్ డిమాండ్ క‌న్నా త‌మిళ‌నాడు విద్యుత్ డిమాండ్ ఎక్కువ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంటే మ‌న‌కు 240 మిలియ‌న్ యూనిట్ల మేర‌కు డిమాండ్ ఉంటే అక్క‌డ 365.35మిలియ‌న్ యూనిట్ల వ‌ర‌కూ డిమాండ్ ఉంది. అయినా కూడా అక్క‌డ కోత‌ల్లేవ్. తెలంగాణ‌లో కూడా 265మిలియ‌న్ యూనిట్ల మేర‌కు డిమాండ్ ఉన్నా కూడా లోటును పూడ్చేందుకు  70 నుంచి 100 కోట్లు వెచ్చిస్తోంది. క‌ర్ణాట‌క‌లోనూ ఇదే విధంగా 271.32మిలియ‌న్ యూనిట్ల డిమాండ్ ఉండ‌గా లోటు భ‌ర్తీకి 90మిలియ‌న్ యూనిట్ల కొనుగోలు ముందస్తు ప్ర‌ణాళిక‌లు చేసింద‌ని ప్ర‌ధాన స్ర‌వంతిలో ఉన్న మాధ్య‌మం వెల్ల‌డి చేస్తోంది.

విద్యుత్ స‌మ‌స్య పరిష్కారానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చొర‌వ చూపుతుంద‌ని అధికారులు అంటున్నా అవేవీ ఫ‌లితం ఇచ్చేలా లేవు. సంక్షోభం కార‌ణంగా ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్ ను నిలిపివేసి తెలివిగా గృహావ‌స‌రాల‌కు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. మ‌రి! ఉత్ప‌త్తి రంగాలు ఇప్పుడిప్పుడే క‌దా పుంజుకుంటున్నాయి వాటి సంగ‌తి ఏం కావాలి. క‌రోనా త‌రువాత కోలుకుంటున్న వ్య‌వ‌స్థ‌ల‌పై పిడుగుపాటు లాంటి   నిర్ణ‌యం వారంలో రెండు రోజులు ప‌వ‌ర్ ఆఫ్ లు ఇవ్వాల‌ని ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి  చెప్ప‌డం. ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ఏమంటే గుజ‌రాత్ లోనూ కోత‌లున్నాయి కావాలంటే క‌నుక్కోండి అని అంటారు. మ‌రి! ఒక‌ప్పుడు మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రం ఎందుక‌ని సంక్షోభం దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని? ఎందుక‌ని ఇదే స‌మ‌స్య‌ను తెలంగాణ కు లేకుండా పోయింద‌ని?

రాష్ట్ర వ్యాప్తంగా ఎండ‌ల తీవ్ర‌త నానాటికీ పెరుగుతోంది. ఎండ‌లకు త‌గ్గ విధంగానే విద్యుత్ కోత‌లు కూడా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌ల‌కు వారానికి రెండు రోజులు ప‌వ‌ర్ ఆఫ్ ను ప్ర‌కటించారు. అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌ను అధిగ‌మించడం అంత సులువు కాద‌ని తేలిపోయింది. గృహావ‌స‌రాల‌కు విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో సైతం విఫ‌లం అవుతున్న ప్ర‌భుత్వం, సంబంధిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంపై దృష్టి సారించ‌డం లేదు అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇదేవిధంగా ఉంటే రానున్న కాలంలో ఉంటే ప‌రీక్ష‌ల సీజ‌న్ లో విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ఈ  నేప‌థ్యంలో ఇంద‌న శాఖ కార్య‌ద‌ర్శి  శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ నెలాఖ‌రు వ‌ర‌కూ కోతలు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యుత్ ఎక్సైజీలలో విద్యుత్ దొర‌క‌ని ప‌క్షంలో గ్రామాల్లో గంట ప‌ట్ట‌ణాల్లో అర‌గంట కోత విధిస్తామ‌ని, రాష్ట్రంలో 55 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ కొర‌త ఉంద‌ని, దీనిని అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని వివ‌రించారు. ఇదే సంద‌ర్భంలో విద్యుత్ డిమాండ్ ను అంచ‌నా వేయ‌డంలో త‌మ త‌ర‌ఫు వైఫ‌ల్యం ఏమీ లేద‌ని అంటున్నారు.
Tags:    

Similar News