ఓటీటీకి సరిపోయే మలుపులు: కిడ్నాప్ చేయించి పెళ్లి చేసుకున్న బజ్జీలకొట్టామె!

Update: 2022-01-28 11:30 GMT
ప్రధాన మీడియాలో ఈ వార్త పెద్దగా ఫోకస్ చేయలేదు. ఒకట్రెండు మీడియా సంస్థల్లో వచ్చినా.. కాసింత గందరగోళంగా వార్తను రావటం.. దాన్ని సరిగా ప్రజెంట్ చేయకపోవటంతో.. గజిబిజిగా తయారైంది. సరిగ్గా చూస్తే.. ఓటీటీ ఫ్లాట్ ఫాంకు సరిగ్గా సూట్ అయ్యే కంటెంట్ ఈ రియల్ క్రైం స్టోరీ సొంతంగా చెప్పాలి. సింఫుల్ గా ఒకే ఒక్క లైన్ లో ఈ స్టోరీని చెప్పేయాలంటే.. డైలీ ఫైనాన్స్ చేసే వ్యాపారిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న ఒక బజ్జీల షాపు మహిళ. అలా ఎలా సాధ్యం? సాధారణంగా మహిళల్ని మగాళ్లు కిడ్నాప్ చేయటం.. వారిని అత్యాచారం చేయటమో లేదంటే బలవంతంగా పెళ్లి చేసుకోవటమో లాంటివి చేస్తారు. మరి.. ఈ స్టోరీ ఏంటి? ఇలా విచిత్రంగా ఉందనుకుంటున్నారా? అందుకే.. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫాంకు సరిగ్గా సూట్ అయ్యే కంటెంట్ అని చెప్పింది.

రీల్ సంగతిని పక్కన పెట్టి రియల్ స్టోరీకి వెళితే.. ఇందులో మలుపులు అన్ని ఇన్ని కావు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట పరిధిలోని కమలాపురం గ్రామానికి సంబంధించిన స్టోరీ ఇది. ఈ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కు లిక్కర్ షాపు ఉంది. దీంతో పాటు.. అతను డైలీ ఫైనాన్స్ కూడా ఇస్తుంటాడు.ఇదిలా ఉంటే.. నర్సంపేటలోని మాదన్నపేట రోడ్డులో ఒక బజ్జీల బండి ఉండేది. దాన్ని నడిపే ఒక వివాహితకు శ్రీనివాస్ అప్పు ఇచ్చాడు. దీని వసూలు కోసం రోజూ షాపుకు వెళ్లేవాడు. అలా మొదలైన వారి పరిచయం.. తక్కువ వ్యవధిలోనే వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ వ్యవహారం ఆ నోటా.. ఈ నోటా పాకటం.. ఆమె భర్త ఈ విషయం గురించి తెలిసి.. మనస్తాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో.. ఆమె గొల్లుమంది. తన భర్త తనకు దూరం కావటానికి శ్రీనివాసే కారణం అంటూ గొడవ పడింది. పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ.. నా భర్త నీ కారణంగానే మమ్మల్ని వదిలేసి వెళ్లాడు.. నా కుటుంబం ఆగమైంది. నేనెలా బతకాలి? అంటూ గోల పెట్టేసింది. ఈ విషయంలో కొంతమంది పెద్ద మనుషులు ఎంట్రీ ఇచ్చారు.

ఇరు వర్గాలను ఒప్పించి.. ఆమెకు ఇచ్చిన బాకీని వదిలేసి.. జరిగిన నష్టానికి రూ.4లక్షలు ఇప్పించి.. ఇక ముందు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ నోటు రాయించి.. లెక్క తేల్చేశారు. అక్కడితో కథ ఆగలేదు. నిజానికి ఇక్కడే మరో దురాలోచన ఆమె మదిలోకి వచ్చింది. శ్రీనివాస్ లాంటి బంగారు బాతు నుంచి మరింత భారీగా డబ్బు లాగేందుకు వీలుగా కొత్తప్లాన్ వేసింది. అక్కడి దగ్గర్లోని ఊరుకు చెందిన అనిల్ అనే కుర్రాడితో కలిసి కిడ్నాప్ ప్లాన్ వేసింది. తనకు తెలిసినవారితో కలిసి ముఠాగా ఏర్పడి.. మాదన్నపేట చెరువు వద్ద శ్రీనివాస్ ను కిడ్నాప్ చేశారు.

అతడు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ముఖానికి ముసుగేసి కారులో తీసుకెళ్లటం.. దాన్ని అక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యులు చూశారు. మరోవైపు కిడ్నాపర్లు.. శ్రీనివాస్ ను రూ.20లక్షలు ఇవ్వాలంటూ బెదిరించటం మొదలు పెట్టారు. మరోవైపు.. శ్రీనివాస్ కిడ్నాప్ అయిన విషయం పోలీసులకు వెళ్లటం.. వారు స్పందించి స్టేషన్ సీఐ.. ఎస్ఐలు శ్రీనివాస్ ఫోన్ కు కాల్ చేశారు. దీంతో.. తమ కిడ్నాప్ పథకం బెడిసికొట్టిందన్న విషయాన్ని గుర్తించిన వారు ప్లాన్ బిలోకి ఎంట్రీ ఇచ్చారు.

శ్రీనివాస్ ను బెదిరించి.. గంజేడు వద్ద అద్దెకు ఉండే ఒక మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. దండలు మార్పించి.. ఫోటోలు తీసిన కిడ్నాపర్లు తమ దారిన తాము చక్కేశారు. బలవంతంగా పెళ్లి చేసిన మహిళతో శ్రీనివాస్ ను ఉంచి.. వారున్న ఇంటికి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. ఇదిలాఉంటే.. శ్రీనివాస్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు శ్రీనివాస్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి.. అతడ్ని విముక్తి చేశారు. ఈ మొత్తం ప్లాన్ కు సత్రధారి అయిన బజ్జీల కొట్టామె.. ఆమెకు సహకరించిన కుర్రాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి డబ్బుల కోసం ఇంత భారీ ప్లాన్ వేసిన బజ్జీలకొట్టామె తెలివికి పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. తొందరపడి కక్కుర్తి పడితే.. విషయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్న దానికి తాజా ఉదంతం చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News