హాట్ టాపిక్: ఇప్పటికి ఇద్దరు మంత్రులు.. ఆ బాటలో మరెంతమంది?

Update: 2022-01-13 03:07 GMT
అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదిక అవుతోంది ఉత్తరప్రదేశ్. యోగి సర్కారుకు మరోసారి అధికారం ఖాయమంటూ ఇప్పటివరకు వెలువడిన అన్ని సర్వేలు స్పష్టం చేస్తుంటే.. అందుకు భిన్నమైన పరిణామాలు రోజువారీగా చోటు చేసుకోవటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మరోసారి అధికారం ఖాయమని బల్లగుద్ది చెప్పే సర్వే రిపోర్టులకు ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ పరిణామాలు చూస్తే.. ‘సమ్ థింగ్ రాంగ్’ అన్నట్లుగా సీన్ ఉందంటున్నారు. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు మంత్రులు.. నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెప్పేయటం.. వారిలో అత్యధికులు అఖిలేశ్ సారథ్యంలోని సమాజ్ వాదీ పార్టీలోకి వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది.

తమనుఇంతలా డ్యామేజ్ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీకి షాకిచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు.. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో.. అందుకు బదులుగా బీజేపీలోకి సమాజ్ వాదీకి చెందిన ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. బయట నుంచి చూస్తున్న వారికి.. బీజేపీ నుంచి బయటకు వస్తున్న నేతల్ని చూసి.. మోడీషాలకు దిమ్మ తిరిగిపోయేలా షాకులిస్తూ వెళుతున్నారంటుంటే.. బీజేపీ నేతల రియాక్షన్ మాత్రం మరోలా ఉంది.

మంత్రులు.. ఎమ్మెల్యేల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని బీజేపీ చెబుతోంది. టికెట్లు దక్కవన్న భయంతో వారు పార్టీని విడిచి పెట్టి వెళుతున్నట్లుగా కమలనాథులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఈ మాటలన్ని కూడా డ్యామేజ్ కంట్రోల్ లో భాగమే తప్పించి.. మరింకేమీ కాదన్న మాట వినిపిస్తోంది. రోజుకు రెండు వికెట్ల చొప్పున బీజేపీ నుంచి బయటకు వస్తున్న ప్రజాప్రతినిధుల కారణంగా కమలం పార్టీకి కంగారు పుట్టిస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్ భర్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. సీఎం యోగి కేబినెట్ నుంచి ప్రతి రోజూ రెండు వికెట్ల చొప్పున పడిపోతాయని పేర్కొన్నారు. జనవరి 20 నాటికి 18 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయటం ఖాయమన్న జోస్యం చెప్పటం ద్వారా.. అసలు సినిమా ఇంకా మొదలు కాలేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. యోగి పాలనతో అణిచివేతకు గురైన వారంతా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని.. బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదంటున్నారు.

ఇంతకీ ఈ రాజ్ భర్ ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. 2017 ఎన్నికల్లో బీజేపీతో జట కట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే.. ఆయనతో పొసగక 2019లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీతో తెగ తెంపులు చేసుకున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో అఖిలేశ్ సారధ్యంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మరి.. రాజ్ భర్ చెప్పిన జోస్యం నిజమైతే మాత్రం బీజేపీకి బోలెడన్ని కష్టాలు తప్పనట్లే.
Tags:    

Similar News