తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు.. ఇద్దరు గవర్నర్లు

Update: 2022-03-01 04:44 GMT
ఒకే రోజున చోటు చేసుకున్న రెండు సీన్లు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఏపీ గవర్నర్ - సీఎంల ఇష్యూ ఒకలా.. తెలంగాణ గవర్నర్ - సీఎం ఇష్యూ మరోలా ఉండటం.. ఇదంతా ఒకే రోజులో చోటు చేసుకోవటం యాదృశ్చికమనే చెప్పాలి. ఇంతకాలం తెర వెనుక ఏం నడిచిందన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుందన్న విషయం మీద మాత్రం అందరికి అవగాహన ఉందని చెప్పాలి.

ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు మీద కత్తి దూసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు తన పోరును రాష్ట్ర గవర్నర్ తమిళ సైతో షురూ చేశారని చెప్పాలి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద తమకున్న ఆగ్రహాన్ని మరికాస్త విస్తరిస్తూ.. రాష్ట్రంలోని గవర్నర్ తమిళ సైతో సున్నం పెట్టుకోవటానికి సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. ఈ నెలలో నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు సంప్రదాయంగా నిర్వహించే గవర్నర్ ప్రసంగాన్ని పక్కన పెట్టేసి.. అసలు గవర్నర్ ను ఆహ్వానించకుండానే.. బడ్జెట్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలు సోమవారం వెలుగు చూడటం తెలిసిందే. తనకు నచ్చని వారి విషయంలో ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే సీఎం కేసీఆర్.. తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో కేంద్రానికి చిరాకు పుట్టించటానికి రాష్ట్రంలోని కేంద్రం ప్రతినిధిగా వ్యవహరించే రాజ్యాంగ శక్తి గవర్నర్ ను టార్గెట్ చేసినట్లుగా అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉండటం విశేషం.

తెలంగాణ గవర్నర్ తమిళ సై మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కత్తి దూస్తూ.. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకుండా దూరంగా ఉంచటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోమవారం తెలంగాణలో ఈ తరహా పరిణామం చోటు చేసుకుంటూ ఉండే.. మరోవైపు ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకుంది. సోమవారం ఏపీ గవర్నర్ నివాసానికి వెళ్లారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఆయన సతీమణి భారతిలు కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు.

దాదాపు అరగంట పాటుగవర్నర్ తో భేటీ అయిన జగన్ దంపతులు..త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల సమాచారాన్ని ఇవ్వటంతో పాటు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. అంతేకాదు.. ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల  ప్రక్రియ గురించిన వివరాల్ని తెలియజేశారు.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని.. దీనిపై నెలకొన్న అభ్యంతరాల్ని ప్రజల నుంచి స్వీకరించి.. పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇలా ఒకే రోజున తెలంగాణ గవర్నర్ తమిళ సై మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘సై’ అంటూ పోరుబాటను ఎంచుకుంటే.. అందుకుభిన్నంగా ఏపీ గవర్నర్ తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్కటి సంబంధాల్ని ఫాలో కావటం గమనార్హం.
Tags:    

Similar News