పెద్దన్న రాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం

Update: 2016-07-12 07:12 GMT
అగ్రరాజ్యమైన అమెరికాలో అనుకోని పరిణామాలు ఈ మధ్య కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న జాత్యాంహకారంతో నల్లజాతీయుల మీద పోలీసులు కాల్పులు జరపటం.. వారి మరణంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావటమే కాదు.. డలాస్ నగరంలో జరిపిన కాల్పుల్లో పలువురు పోలీసు అధికారులు మృతి చెందడటం షాకింగ్ గా మారింది.

ఈ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న అమెరికా తాజాగా ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. మిచిగాన్ స్టేట్ సెయింట్ జోసెఫ్ సిటీలోని బెరియన్ కౌంటీ వద్దకు ఒక నిందితుడ్ని పోలీసులు తీసుకొచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది దగ్గరి తుపాకీని లాక్కున్న వ్యక్తి కాల్పులకు దిగాడు. దీంతో.. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

విచారణకు తీసుకొచ్చిన ఖైదీ చేసిన చర్యతో కోర్టు హాల్ వద్ద సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తించే ఇద్దరు అధికారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రియాక్ట్ అయిన అధికారులు కాల్పులుజరిపిన వ్యక్తిని కాల్చి చంపేశారు. అయితే.. కాల్పులు జరిపిన ఖైదీ ఎవరు? ఏ నేరం మీద అతడ్ని అదుపులోకి తీసుకున్నారు? లాంటి వివరాల్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. డలాస్ ఉదంతం గడిచి రెండు.. మూడు రోజులు కాకముందే మరో ఘటన చోటు చేసుకోవటంపై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News