జేడీఎస్ క్యాంపు నుండి ఇద్ద‌రు జంప్

Update: 2018-05-16 06:32 GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో వ‌చ్చిన అనిశ్చితి అక్క‌డి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ శిబిరాల‌లో క‌ల‌వ‌రం రేపుతోంది. 103 సీట్ల‌తో అగ్ర‌స్థానాన ఉన్న బీజేపీ అధికార పీఠం ఎక్క‌డానికి స‌రిప‌డా బ‌లం చేకూర‌క‌పోవ‌డంతో ఇత‌ర పార్టీల వారికి గాలం వేస్తుంది. దీంతో త‌మ త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ లు తంటాలు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా య‌డ్యూర‌ప్ప ఎన్నిక‌య్యారు. బ‌లం నిరూపించుకునేందుకు గ‌వ‌ర్న‌ర్ వారికి ఏడు రోజుల స‌మ‌యం కూడా ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు జేడీఎస్ శాస‌న‌స‌భా ప‌క్షం స‌మావేశం అయింది. అయితే ఈ స‌మావేశానికి జేడీఎస్ కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ పార్టీకి చెందిన రాజా వెంకటప్ప నాయక్, వెంకట రావు నడగౌడలు కనిపించకుండాపోయారు. ఇప్ప‌టికే జేడీఎస్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కుమార‌స్వామికి ఆయ‌న సోద‌రుడు రేవ‌ణ్ణ ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యార‌య్యాడు. ఆయ‌న బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తార‌ని, ఆయ‌న‌కు బీజేపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అఫ‌ర్ చేసింద‌ని తెలుస్తుంది. ఈ ప‌రిస్థితుల‌లో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రాక‌పోవ‌డం జేడీఎస్ శిబిరంలో ఆందోళ‌న రేపుతోంది.

బీజేపీకి అధికారం ద‌క్కొద్దు అన్న ల‌క్ష్యంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపింది. అయితే ఒక్కళిగ వర్గానికి చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎంత మాత్రం ఒప్పుకోమ‌ని కాంగ్రెస్ లోని లింగాయత్ ఎమ్మెల్యేలు అంటున్నారు. బీజేపీ అత్య‌ధిక స్థానాలు సాధించిన నేప‌థ్యంలో త‌మ త‌మ పార్టీల‌లోని ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డం కాంగ్రెస్, జేడీఎస్ ల‌కు క‌త్తి మీద సాములా మారింది.
Tags:    

Similar News