ప్రపంచంలోని టాప్ వర్సిటీల్లో రెండు హైదరాబాద్ లోనే!

Update: 2023-05-20 10:02 GMT
మరోసారి హైదరాబాద్ మహానగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్ కున్న ప్రత్యేక స్థానం గురించి తెలిసిందే. అదే సమయంలో వైద్యానికి సంబంధించిన సేవల్లోనూ భాగ్యనగరి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా వెలువడిన ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ కు లభించిన స్థానంపై హర్షం వ్యక్తమవుతోంది.

సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023కు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ మహా నగరిలో రెండు విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి.

టాప్ 2 వేల వర్సిటీల్లో భారతదేశానికి సంబంధించిన 64 విశ్వవిద్యాలయాలు చోటును దక్కించుకోగా.. అందులో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ 1265వ ర్యాంకును.. ఐఐటీ హైదరాబాద్ 1373వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. గత ఏడాది ర్యాంకింగ్స్ తో పోలిస్తే హెచ్ సీయూ ఏడు ర్యాంకులు కిందకు పడిపోగా.. ఐఐటీ హైదరాబాద్ మాత్రం 68స్థానాలు ముందుకురావటం ఆసక్తికరంగా మారింది.

ఇక.. దేశంలోని వర్సిటీల్లో ఐఐటీ అహ్మదాబాద్ 419 ర్యాంకుతో టాప్ లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. ఐఐటీ మద్రాస్ సంస్థలు నిలిచాయి.

దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ నిలిచింది. ది వీక్ హన్సా పరిశోధన సర్వే 2023లో దేశంలోని టాప్ 85 మల్టీ డిసిప్లినరీ వర్సిటీల్లో రాష్ట్రస్థాయిలోనూ.. సెంట్రల్ స్థాయిలోనూ.. ప్రైవేట్.. డీమ్డ్ వర్సిటీల్లో హెచ్ సీయూ నాలుగో స్థానంలో నిలవటం గమనార్హం. గత ఏడాది ఐదో స్థానంలో నిలవగా.. ఈసారి నాలుగో స్థానానికి వెళ్లిందని.. దక్షిణాది రాష్ట్రాల్లో టాప్ మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయాల్లో హెచ్ సీయూ టాప్ వన్ స్థానంలో నిలిచినట్లుగా వర్సిటీ పేర్కొంది.

ప్రపంచంలో అత్యుత్తమ వర్సిటీగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ కోసం పలు అంశాల్ని పరిగణలోకి తీసుకున్నారు. వాటి ఆధారంగా ర్యాంకింగ్స్ ను కేటాయించారు. నిజానికి పరిశోధనల్లో వెనుకబాటు తోపాటు నిధుల కేటాయింపులోనూ నిర్లక్ష్యం ఉంది. ఈ కారణంగానే దేశీయ వర్సిటీలు వెనుకపడినట్లుగా విమర్శలు ఉన్నాయి. మోడీ సర్కారు సైతం.. విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపులో పెద్ద మనసుతో వ్యవహరించలేదని మాత్రం చెప్పక తప్పదు.

Similar News