అమరావతిలో సంచలనంగా మారిన వారిద్దరి అరెస్టు

Update: 2020-07-16 07:15 GMT
ఏపీ రాజధాని అమరావతితో అనుబంధం ఉన్న ఇద్దరు ముఖ్యులు అరెస్టు కావటం సంచలనంగా మారింది. చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి రుజువైందని చెప్పక తప్పదు. అరెస్టు అయిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ కాగా.. మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్ విజయవాడలో ఎం అండ్ ఎం షోరూం యజమాని గుమ్మడి సురేశ్ కావటం గమనార్హం.

అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల్ని మార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వీరిద్దరు నడిపించిన కథపై పలు ఆరోపణలు ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా 29 గ్రామాల పరిధిలో 33వేల ఎకరాల్ని నాటి టీడీపీ ప్రభుత్వం సేకరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు.. వారి సన్నిహితులు అక్రమంగా తీసుకున్నట్లు పలువురు ఫిర్యాదులు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి పంచాయితీ పరిధిలోని పెదలంక సర్వే నంబరు 376/2ఎలో 3.70 ఎకరాలను 1975లో నాటి ప్రభుత్వం అసైన్డ్‌ ల్యాండ్‌ కింద ఎస్సీలకు పంపిణీ చేసింది.

ఇందుకు సంబంధించిన లబ్ధిదారులుగా యలమంచిలి సూరయ్య.. ఆయన కుమారులు ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో తహసీల్దార్ గా పని చేసిన సుధీర్ వీరికి చెందిన అసైన్డు భూమిని పట్టా భూమిగా మార్చారు. ఆన్ లైన్ ద్వారా వెబ్ ల్యాండ్ లోకి ఎక్కించారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేశ్ 86 సెంట్ల భూమిని అసైనీల నుంచి కొనుగోలు చేసి శ్రీనివాసబాబు అనే వ్యక్తికి అమ్మారు. ఈ రీతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కైన సుధీర్ బాబు రికార్డుల్ని ఇష్టానుసారంగా తారుమారు చేసినట్లుగా తర్వాత వెల్లడైంది.

ఈ మోసాన్ని గుర్తించిన అధికారులు కలెక్టర్ కు నివేదిక ద్వారా పంపారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆయనపై చర్యలు తీసుకున్నారు. రాజధాని గ్రామాలైన అనంతవరం.. నేలపాడు.. వెలగపూడి.. రాయపూడి.. పెదలంక తదితర గ్రామాల్లోని మరో తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు సైతం తారుమారు అయినట్లుగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనికి సంబంధించిన కేసులో మాజీ తాహసీల్దారు సుధీర్.. రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేశ్ లు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని పాపాలు బయటకు రానున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News