యూఏఈ చ‌రిత్ర‌లో తొలిసారి అలా జ‌రిగింద‌ట‌!

Update: 2019-04-29 05:12 GMT
యూఏఈ చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. నేటి డిజిట‌ల్ యుగంలోనూ ఆ దేశంలో అనుస‌రించే చ‌ట్టాలు.. కొన్ని అంశాల విష‌యంలో వారు వ్య‌వ‌హ‌రించే తీరు భిన్నంగా ఉంటుంది. తాజాగా అలాంటి విష‌యంలో ఆ దేశం తొలిసారి త‌న తీరును మార్చుకుంది. యూఏఈ చ‌రిత్ర‌లో తొలిసారి.. త‌న నిబంధ‌న‌ల్ని ప‌క్క‌న పెట్టి ఒక పాప‌కు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ ఇదెలా జ‌రిగింది?  దీనికి కార‌ణం ఏమిటి?  ఇంత‌కీ ఆ ఇష్యూ ఏమిట‌న్న వివ‌రాల్లోకి వెళితే..యూఏఈ వివాహ చ‌ట్టాల ప్ర‌కారం ఇస్లాం మ‌తానికి చెందిన పురుషుడు.. ఇత మ‌తాల‌కు చెందిన మ‌హిల‌ను పెళ్లాడ‌వ‌చ్చు. అయితే.. ఇస్లాం మ‌తానికి చెందిన మ‌హిళ‌ను ఇత‌ర మ‌తాల‌కు చెందిన వ్య‌క్తి పెళ్లాడ‌కూడ‌దు. ఒక‌వేళ వేరే దేశానికి చెందిన జంట అలా పెళ్లాడినా.. వారి దేశంలో వారికి పిల్ల‌లు పుడితే.. జ‌న్మ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఇవ్వ‌రు.

భార‌త్ కు చెందిన కిర‌ణ్ బాబు అనే వ్య‌క్తి కేర‌ళ‌కు చెందిన స‌నామ్ సాబూ సిద్దిక్ అనే మ‌హిళ‌ను 2016లో పెళ్లాడారు. పెళ్లి త‌ర్వాత వారు యూఏఈ వెళ్లారు. 2018లో ఆమె త‌ల్లైంది. అయితే.. వారి వివాహం యూఏఈ చ‌ట్టాల‌కు విరుద్దంగా ఉండ‌టంతో.. వారి పాప‌కు జ‌న్మ ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌టానికి నో చెప్పారు.

ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. అధికారులు తాము గుర్తింపు ప‌త్రాన్ని ఇవ్వ‌మ‌ని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. 2019 సంవ‌త్స‌రాన్ని స‌హ‌న సంవ‌త్స‌రంగా యూఏఈ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో.. ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన కిర‌ణ్ రావు.. త‌మ‌కు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు.

త‌మ పాప‌ను గుర్తిస్తూ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వాల‌ని కోరారు. స‌హ‌న సంవ‌త్స‌రంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయ‌స్థానం.. చ‌రిత్ర‌లో తొలిసారి త‌మ రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. కిర‌ణ్ బాబు దంప‌తుల‌కు పుట్టిన పాప‌కు జ‌న్మ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అంద‌జేశారు. దీంతో పుట్టిన తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఆ పాపకు అనాంత ఏస్ లీన్ కిర‌ణ్ పేరును పెట్టారు. ఇదే పేరుతో అధికారులు జ‌న్మ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఇచ్చారు.
Tags:    

Similar News