ఉద్ధవ్ విక్టరీ..బీజేపీ పోటీకే నిలబడలేదు

Update: 2019-11-30 17:37 GMT
ట్విస్టుల మీద ట్విస్టులుగా సాగిన మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివసేనాధిపతి ఉద్ధవ్ ఠాక్రే... బల పరీక్షలో విక్టరీ కొట్టేశారు. ఉద్ధవ్ కు సీఎం కుర్చీ దక్కకుండా - తనకు మాత్రమే ఆ సీటు దక్కాలన్న రీతిలో చివరి దాకా శతవిధాలా యత్నించిన బీజేపీ...  ఉద్ధవ్ బలపరీక్ష సందర్భంగా చేతులెత్తేసింది. బల నిరూపణకు ముందే బీజేపీ ఓటమి అంగీకరించడంతో 169 ఓట్లతో ఉద్ధవ్ రికార్డ్ విక్టరీ కొట్టేశారు. వెరసి మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైందన్న భావనను ఉద్ధవ్ కలిగించారని చెప్పక తప్పుదు.

దాదాపుగా నెలన్నర పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మలుపు చొప్పున ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్లో మిత్రపక్షాలు గానే పోటీ చేసిన బీజేపీ - శివసేన... జాయింట్ గానే మెజారిటీ సాధించిన తర్వాత సీఎం సీటు కోసం కుస్తీ పడ్డాయి. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం సీటును పంచుకుందామంటూ శివసేన చేసిన ప్రతిపాదనకు బీజేపీ ససేమిరా అంది. దీంతో ఇరు పార్టీలు ప్రత్యర్థులుగా మారిపోయాయి. సీఎం సీటును దక్కించుకునేందుకు ఇరు పార్టీలు తమదైన రీతిలో వ్యూహాలు అమలు చేశాయి. ఈ క్రమంలోనే ట్విస్టులకే ట్విస్టులు అన్నట్టుగా అక్కడి రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అయితే ఎట్టకేలకు సీఎంగా తొలుత ప్రమాణం చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్...తనకు బలం లేదని తెలుసుకుని రాజీనామా చేయగా... ఆ వెంటనే ఎన్సీపీ - కాంగ్రెస్ ల మద్ధతుతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. గవర్నర్ నిర్దేశం మేరకు శనివారం మధ్యాహ్నం తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ బలపరీక్షకు నిలబడ్డారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ప్రభుత్వం బలనిరూపణలో విజయం సాధించింది. ఈ మూడు పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర  అసెంబ్లీలో నేడు బల పరీక్ష నిర్వహించగా - ఉద్ధవ్ సర్కారుకు అనుకూలంగా 169 ఓట్లు పడ్డాయి. బల పరీక్ష సమయానికి సభలో ఉన్న ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా - నలుగురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. బలపరీక్షకు ముందే 105 మంది బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
   

Tags:    

Similar News