ఆధార్ బ‌దులుగా.. ఇది వ‌చ్చేస్తోంది

Update: 2018-01-11 04:19 GMT
బ్యాంకు ఖాతాల నుంచి మొదలు - సెల్‌ ఫోన్ల కు సిమ్‌ కార్డుల జారీ వరకు అన్ని ప్రభుత్వ పథకాలు - సేవలకు ఆధార్ కార్డును జత చేయాలని ముడిపెట్టడం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతా హక్కులకు భంగం కలుగుతోంద‌న్న ఆందోళనలను పరిష్కరించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఏడీఏఐ) ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టింది. అదే వర్చ్యువల్ ఐడీ.. సిమ్ కార్డుల జారీ వంటి వివిధ సౌకర్యాలు - సేవలు కావాలనేకునే వారు ఇకపై ఆధార్‌ ను చూపించాల్సిన అవసరం లేదు. వారు ఆధార్‌ కు బదులు వర్చ్యువల్ ఐడీని చూపించి సేవలను పొందవచ్చు.

ఆధార్ సంఖ్యలో 12 అంకెలు ఉంటే వర్చ్యువల్ ఐడీలో 16 అంకెలు ఉంటాయి. వర్చ్యువల్ ఐడీ అనేది ఒక వ్యక్తి గుర్తింపునకు సంబంధించిన పరిమిత వివరాలను మాత్రమే అందజేస్తుంది. ఆధార్ సంఖ్యను తెలుపకుండా వివిధ సేవలు పొందే అవకాశాన్ని వర్చ్యువల్ ఐడీ కల్పిస్తుంది. అంటే ఉదాహరణకు సిమ్‌ కార్డుల తనిఖీ కోసం ఆధార్ సంఖ్యను తప్పకుండా తెలియజేయాల్సిన పని ఉండదు. సిమ్‌ లు జారీ చేసే కంపెనీకి వినియోగదారు ఎవరనేది తెలియడానికి అవసరమైన వినియోగదారుని పేరు - ఫొటో వగైరా బయోమెట్రిక్ సమాచారం - చిరునామా వంటి వివరాలుండే వర్చ్యువల్ ఐడీని సమర్పిస్తే చాలు.

వర్చ్యువల్ ఐడీ అనేది ఆధార్ సంఖ్యలాగా శాశ్వతమైన సంఖ్య కాదు. దీనిని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. ఆధార్‌ కార్డులున్నవారు యూఏడీఏఐ వెబ్‌ సైట్ ద్వారా వర్చ్యువల్ ఐడీని తమంత తాము పొందవచ్చు. ఒకటి కాదు ఎన్ని వర్చ్యువల్ ఐడీలనైనా ఒక వ్యక్తి తీసుకోవచ్చు. అయితే కొత్తగా మరో వర్చువల్ ఐడీ తీసుకోగానే పాత ఐడీ ఆటోమెటిక్‌ గా రద్దవుతుంది. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి వర్చ్యువల్ ఐడీల జారీ అభ్యర్థనలను యూఏడీఏఐ స్వీకరిస్తుంది. వినియోగదారుల వర్చ్యువల్ ఐడీలను సేవాసంస్థలు ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి విధిగా అంగీకరించాలి. అలా అంగీకరించని సంస్థలకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు లభించవు. దీనివల్ల ప్రతి విషయానికీ వినియోగదారుల ఆధార్ సంఖ్యలను సేకరించాల్సిన భారం సర్వీసు సంస్థలకు కూడా తప్పుతుంది.
Tags:    

Similar News