అమరావతి చంద్రబాబు కోట

Update: 2015-11-05 10:28 GMT
రాజధాని లేని నవ్యాంధ్రకు ముఖ్యపట్టణంగా అమరావతిని నిర్మిస్తున్న చంద్రబాబు ఆ అమరావతిని ఎవరికోసం కట్టిస్తున్నారు... ప్రజల కోసమా లేకుంటే చంద్రబాబు కోసమా...? అందరూ దాన్ని ప్రజారాజధాని అంటున్నారు కాబట్టి అది ప్రజల కోసమేనని కచ్చితంగా చెప్పొచ్చు.. అయితే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం అది చంద్రబాబు కోసం కట్టించుకుంటున్న కోట అని.. ఆయన సొంతానికి వాడుకునేందుకు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమరావతి ప్రజారాజధానే కాదని.. ప్రజలకు ఆ నిజం త్వరలోనే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆయన పట్టిసీమ ప్రాజెక్టుపైనా విమర్శలు గుప్పించారు. రిజర్వాయర్ లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడం పెద్ద తప్పు అని ఉండవల్లి అన్నారు.  రాజమండ్రి ఇరిగేషన్ కార్యాలయంలో పట్టిసీమ జి.ఓ - ఒప్పందాలు - ఇతర వివరాల పత్రాలను ఆయన పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో 490 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. రిజర్వాయిర్ లేకుండా 80 టి.ఎమ్.సి నీరు తరలిస్తామని చెబుతున్నారని, నిల్వ చేసుకునే వసతి లేకుండా ప్రాజెక్టును చేపట్టడమే పెద్ద తప్పు అని ఆయన అబిప్రాయపడ్డారు. 830 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏభై మూడు శాతం పని పూర్తి అయినట్లు రాసుకున్నారని ఉండవల్లి అన్నారు.

ఉండవల్లి ఇరిగేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగి ఫైళ్లు చదువుతూ ఆధారాలు సేకరిస్తున్నారంటే ఎవరిపైనైనా కేసు వేస్తారని అర్థమని అంటున్నారు. గతంలో ఆయన ఈనాడు పత్రిక కార్యాలయాలకు వెళ్లి తన వ్యక్తిగత అవసరం కోసమని చెప్పి పాత పేపర్లన్నీ నెలల తరబడి తిరగేసి.. ఆ సమాచారం ఆధారంగా ఏకంగా రామోజీరావుపైనే కేసు వేశారు. ఇప్పుడు కూడా ఇరిగేషన్ ఆఫీసుల్లో ఫైళ్లు వెతికి వారిపైనో.. ప్రభుత్వంపైనో కేసు వేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.
Tags:    

Similar News