ఉండ‌వ‌ల్లి!... బాబును పూర్తిగా క‌డిగేశారు!

Update: 2019-01-04 12:31 GMT
తెలుగు నేల రాజకీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌ - రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌... మీడియా ముందుకు వ‌చ్చారంటే... ఎవ‌రి బండారం బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని రాజ‌కీయ నేత‌లంతా బిక్క‌చ‌చ్చిపోవాల్సిందే. ఉన్న మాట‌ను ఉన్న‌ట్లుగానే చాలా నిక్క‌చ్చిగా... ప‌క్కా ఆధారాల‌తో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టుగా మాట్లాడే ఉండ‌వ‌ల్లి... నేటి ఉద‌యం విశాఖ కేంద్రంగా మీడియా ముందుకు వ‌చ్చేశారు. ఎప్ప‌టిలానే అధికార టీడీపీ - ఆ పార్టీ ప్ర‌భుత్వం - ఆ ప్ర‌భుత్వంలో కొన‌సాగుతున్న అవినీతి - చంద్ర‌బాబు మార్కు రాజ‌కీయాలు - బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న దుబారా... త‌దిత‌రాల‌న్నింటినీ ఏక‌బిగిన బ‌య‌ట‌కు లాగేశారు. అస‌లు ఏపీలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం... రాష్ట్రాన్ని ఏ మేర‌కు అభివృద్ధి చేసింద‌న్న విష‌యం దగ్గ‌ర నుంచి మొద‌లెట్టిన ఉండ‌వ‌ల్లి... బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న అవినీతిని పిన్ టూ పిన్ వెల్ల‌డించేశారు. అంతేకాకుండా బాబు మార్కు రాజ‌కీయాన్ని - గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బాబు నెర‌పిన పోలింగ్ మేనేజ్ మెంట్ పై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో పాటుగా... ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా కాస్తంత విపులంగానే విశ్లేషించారు.

చంద్రబాబు ప్రభుత్వం ఆదరణ పథకం కింద అందించిన వాషింగ్ మెషీన్లతో పాటు ఎల్ ఈడీ లైట్లు - అన్న క్యాంటీన్లు సహా అవినీతి లేని పథకం ఒక్కటీ లేదని ఉండవల్లి విమర్శించారు. ఒక్కో ఎల్ ఈడీ బల్బు రూ.600 ఉంటే ప్రజలకు రూ.6000కు అమ్మారని ఆయ‌న‌ దుయ్యబట్టారు. ఈ భారం ప్రజలకు కనిపించకుండా పదేళ్ల పాటు నెలకు రూ.45 కట్టాలని రూల్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏల కు రూ.7 వేల విలువైన ఫోన్ అప్పగించి రూ.12,000 వసూలు చేస్తున్నారని అన్నారు. ఇంత విచ్చలవిడిగా అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఏమిటని కూడా ఆయ‌న‌ ప్రశ్నించారు. అన్న క్యాంటీన్ ఒక్కో ప్లేటుపై రూ.27 కొట్టేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. రేపు చంద్రబాబు నెగ్గితే ‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండే ప్రభుత్వ ఆస్తులు అన్నీ స్థానిక ఎమ్మెల్యే అధీనంలోకి వెళతాయి’ అని తీర్మానం చేసినా చేయొచ్చని వ్యాఖ్యానించారు. బాబు కేబినెట్ నిర్ణయాలపై చట్టపరంగా మాత్రమే సవాలు చేయొచ్చనీ - అవినీతి ఆరోపణలు చేయలేమని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు.

అసెంబ్లీని బాయికాట్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విప‌క్ష నేత హోదాలో తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టిన ఉండ‌వ‌ల్లి... గ‌డ‌చిన ఎన్నికల్లో బాబు మాదిరిగా అమ‌లు సాధ్యం కాని హామీలు ఇవ్వ‌ని కార‌ణంగానే జ‌గ‌న్ అధికారంలోకి రాలేక‌పోయార‌ని విశ్లేషించారు. ఇక ఏపీలోని అవినీతిని ఇత‌ర రాష్ట్రాల్లోని అవినీతితో పోల్చిన ఉండ‌వ‌ల్లి... పైఅధికారులు నీతిగా ఉంటే కిందిస్థాయి ఉద్యోగులు నిజాయతీగా పనిచేస్తారని చెప్పారు. కేరళకు వెళితే అక్కడ అవినీతి అనేదే ఉండదనీ - కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా - కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పారదర్శక పాలన ఉంటుందని తెలిపారు. అలా ఉంటేనే కేరళ ప్రజలు నాయకులకు ఎన్నికల్లో ఓటు వేస్తారని చెప్పారు. కానీ ఏపీలోమాత్రం అవినీతి చేయకుంటే ఓటు వేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇక్కడ ప్రజల నుంచే అవినీతి మొదలయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అవినీతి జరిగిందనీ, అయితే చంద్రబాబు హయాంలో జరిగినంత దారుణంగా లేదని స్పష్టం చేశారు.

ఇక చంద్ర‌బాబు నిత్యం డ‌బ్బాలు కొట్టుకునే పోల‌వ‌రం ప్రాజెక్టును కూడా ప్ర‌స్తావించిన ఉండ‌వ‌ల్లి.... మే నెలలో పోలవరం నీరు ఇస్తామని చెబుతున్నచంద్రబాబుకు ఆ సమయంలో గోదావరిలో నీళ్లు ఉండవన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. గోదావరి నుంచి గ్రావీటితో నీళ్లు రావన్న విష‌యాన్ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. లక్షా 45వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ప్రారంభించామని ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధమేనని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. బాబు స‌ర్కారు ఇప్పటి వరకు కడుతున్నవి తాత్కాలిక భవనాలేనని.. ఆంధ్ర ప్రజలకు ఎందుకు ఈ ఖర్మ అని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. శ్వేతపత్రాలపై చర్చకు ప్రభుత్వం తరఫున ఎవరూ స్పందించడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోసం చేయడానికే శ్వేతపత్రాలు అంటే ఎవరేం చేసేది లేదని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రాలపై ఐఏఎస్‌ అధికారులతో చర్చ పెట్టాలని ఆయ‌న‌ కోరారు. ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పోలవరం - ఇరిగేషన్‌ - ఆదరణ - ఎల్‌ ఈడీ బల్బులు - అన్నా క్యాంటీన్‌ సహా వేటిపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. త‌న పాల‌న‌పై దూసుకువ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స్పందించే పరిస్థితిలో కూడా చంద్ర‌బాబు ప్రభుత్వం లేదని కూడా ఉండ‌వ‌ల్లి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా మొన్న‌టిదాకా ఏదో ఒక సెల‌క్టివ్ అంశంపైనే మాట్లాడే ఉండ‌వ‌ల్లి ఈ రోజు మాత్రం చంద్ర‌బాబు బండారం మొత్తాన్ని బ‌య‌ట‌పెట్టేశార‌నే చెప్పాలి.


Full View

Tags:    

Similar News