ఉండ‌వ‌ల్లి కొత్త పాయింట్ లేవ‌నెత్తాడుగా?!

Update: 2016-06-11 06:45 GMT
ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసిన‌ట్లుగా వ్య‌వ‌హరిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ కొత్త పాయింట్‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. గోదావరి పుష్కరాల్లో జ‌రిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ స‌మ‌యంలో ఉండవ‌ల్లి కొత్త ఆరోప‌ణ‌లు చేశారు. విచారణకు హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సీఈఓగా వ్యవహరించి, ట్రాఫిక్‌ ను కూడా క్రమబద్ధీకరించిన సీఎం చంద్ర‌బాబును ప్రత్యక్ష సాక్షిగా పరిగణించి విచారించాలన్నారు. సీఈఓగా వ్యవహరించి పూర్తి బాధ్యతను వహించిన ముఖ్యమంత్రి తన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే విచారణ కమిషన్‌ ను వేశారని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటి వరకు ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదని మండిప‌డ్డారు.

2005లో కృష్ణా పుష్కరాల సందర్భంగా రెయిలింగ్ కూలిపోయి ఎనిమిది మంది మరణిస్తే అప్పటి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించి - కలెక్టర్ - ఎస్పీలను బదిలీ చేసి - ఇంజనీర్లు - కాంట్రాక్టర్లను సస్పెండ్ చేసిందని ఉండ‌వ‌ల్లి గుర్తుచేశారు. ప్ర‌స్తుతం జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో అలాంటివి లేవ‌న్నారు. పైగా కృష్ణా జిల్లా కలెక్టర్ తన అఫిడవిట్‌ లో తమను ప్రతిప‌క్ష నాయకులుగా పేర్కొనడంపై ఉండ‌వ‌ల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి తనను తాను అధికారపక్షానికి చెందిన వ్యక్తిగా కలెక్టర్ పేర్కొన్నట్లు ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికల్లో ఏది సరైందో కూడా తేల్చాలని ఉండవల్లి వాదించారు. ఈ సంఘటనపై కలెక్టర్‌ ను - సంబంధిత అధికారులను కూడా విచారించాలన్నారు. విచారణలో భాగంగా ఈ నిర్లక్ష్యానికి బాధ్యులను తేల్చి, వారిని విచారించాలని, లేనిపక్షంలో కమిషన్ ఏర్పాటుకు అర్థం ఉండదని అన్నారు.

బార్‌ కౌన్సిల్ సభ్యుడు - న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వాదిస్తూ కలెక్టర్ అఫిడవిట్‌ లో సరైన ఆధారాలు ఇవ్వలేదని, ఆయన వాదనల్లో హేతుబద్ధత కూడా లేదన్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కెమెరాలు కేవలం పరిశీలనకే వినియోగించామని, సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజీ కూడా లేదని  చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలరేవులో ఎక్కువసేపు గడపటం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. వైసీపీ కేంద్రకమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పుష్కరాల్లో విఐపిల కోసం ప్రత్యేక స్నానఘట్టం ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రి పుష్కరాల రేవులో ఎక్కువ సమయం ఉండటం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు.

పుష్క‌రాల దుర్ఘ‌ట‌న‌ విష‌యంలో అప్ప‌ట్లోనే ఉండ‌వ‌ల్లి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప‌ట్టిన ప‌ట్టు వీడ‌ర‌నే పేరున్న ఉండ‌వ‌ల్లి అదే తీరును కొన‌సాగించ‌డం చూస్తుంటే ఒక‌నాటి వైఎస్ జ‌మానాకు ఇప్ప‌టికీ పెద్ద తేడా ఏం లేద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News