ఉండవల్లి లాజిక్ కరెక్టేనా ?

Update: 2022-05-25 08:30 GMT
రాష్ట్రంలోని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాజిక్ కరెక్టే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. చివరి నిముషంలో బీజేపీతో జనసేన విడిపోయి టీడీపీతో కలుస్తుందని ఉండవల్లి అన్నారు. ఈ విషయం కొత్తదేమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రచారం చాలాకాలంగా జరుగుతున్నదే. అందరికీ తెలిసిన విషయాన్ని మీడియా సమావేశం పెట్టి ఉండవల్లి చెప్పారు.

అయితే మాజీ ఎంపీ చెప్పిన ఒక లాజిక్ మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంది. అదేమిటంటే ఏపీలో ఏ పార్టీ తరపున ఎంత మంది ఎంపీలు గెలిచినా అంతా బీజేపీ ఎంపీలే అయిపోతారట. ఎలాగంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇటు వైసీపీ అటు టీడీపీ కూడా ధైర్యం చేయడం లేదు.

కేంద్ర ప్రభుత్వాన్ని థిక్కరిస్తే కదా ప్రతిపక్షమయ్యేది. కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా తలూపుతుంటే ఇక అధికార పార్టీ ఎంపీలుగా చలామణి అవకుండా ప్రతిపక్ష ఎంపీలుగా జనాలు ఎలాగనుకుంటారు.

చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందిదే ఇపుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్నదీ ఇదే. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తున్న అదేమని అడిగే ధైర్యం, ఎదురుతిరిగే ధైర్యం జగన్, చంద్రబాబు ఇద్దరిలోను లేదు.

కేంద్రం చేస్తున్న తప్పులు, వ్యతిరేక నిర్ణయాల్లో మోడిని నిలదీసింది కనీసం ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా లేకపోయింది. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేస్తున్నది నరేంద్రమోడి సర్కార్ అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంతసేపు జగన్నే టార్గెట్ చేస్తున్నారు.


అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని గనుక థిక్కరిస్తే కచ్చితంగా జనాలంతా జగన్ వెంటే నడుస్తారు. అయితే జగన్ ఆపని చేయకుండా కేంద్రానికి లేఖలు మాత్రమే రాస్తున్నారు. లేఖలతో పనయ్యే రోజులు ఎప్పుడో పోయాయని జగన్ తెలీదా ? వీళ్ళిద్దరే ఇలాగున్నారనుకుంటే మూడో నేత పవన్ కూడా అలాగే తయారయ్యారు.  మొత్తానికి అన్ని పార్టీలు కలిసి ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నది మాత్రం వాస్తవం.
Tags:    

Similar News