ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ కు వీళ్లంతా అన‌ర్హులు!

Update: 2019-02-08 07:15 GMT
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మ‌ళ్లీ అధికార పీఠ‌మెక్క‌డ‌మే ల‌క్ష్యంగా ఇటీవ‌ల ఎన్డీయే ప్ర‌భుత్వం జ‌న‌రంజ‌క బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టింది. పేరుకు ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్టే అయినా కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేసింది. రైతులకు నేరుగా న‌గ‌దు స‌హాయం చేసేందుకుగాను ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి(పీఎం-కిసాన్‌)ని ప్ర‌వేశ‌పెట్టింది. పీఎం కిసాన్ కింద దేశ‌వ్యాప్తంగా 12.5 కోట్ల మంది చిన్న, స‌న్న‌కారు రైతుల‌కు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అంద‌నుంది. 2 హెక్టార్లు లేదా అంత‌కంటే త‌క్కువ భూమి ఉన్న రైతు కుటుంబాలు ఈ స‌హాయం పొందేందుకు అర్హుల‌ని వెల్ల‌డించింది. రూ.6 వేల‌ను మొత్తం మూడు విడ‌త‌ల్లో రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని తెలిపింది.

తాజాగా ఈ ప‌థ‌కానికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌య్యాయి. ఎవ‌రెవ‌రు ఇందులో ఆర్థిక స‌హాయం పొందేందుకు అర్హులో వాటి ద్వారా ప్ర‌భుత్వం తెలియ‌జేసింది. నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పీఎం కిసాన్ స‌మ్మాన్ ప‌థ‌కం కింద స‌హాయం పొందేందుకు అన‌ర్హులు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యాంగ‌బ‌ద్ధ హోదాల్లో ఉన్న‌వారు, పన్ను చెల్లింపుదారులు, విశ్రాంత‌-స‌ర్వీసులో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు, నెల‌కు రూ.10 వేల కంటే ఎక్కువ పింఛ‌ను తీసుకుంటున్న‌వారు కూడా అన‌ర్హులే.

వైద్యులు, ఇంజినీర్లు, న్యాయ‌వాదులు, చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు వంటి ఫ్రొఫెష‌న‌ళ్లు; ప‌్రొఫెష‌న‌ల్ సంఘాల్లో న‌మోదు చేసుకున్న ఆర్కిటెక్టుల‌కు పీఎం కిసాన్ స‌మ్మాన్ స‌హాయ నిధి అంద‌దు. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల మాజీ-ప్ర‌స్తుత మేయ‌ర్లు, జిల్లా పంచాయ‌తీల మాజీ-ప్ర‌స్తుత ఛైర్ ప‌ర్స‌న్లు కూడా అన‌ర్హులే. ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌, క్లాస్‌-4, గ్రూప్-డి ఉద్యోగులు మాత్రం పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి నుంచి స‌హాయం పొంద‌గ‌ల‌రు.

రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల రికార్డుల ప్ర‌కారం భ‌ర్త‌, భార్య‌, వారి మైన‌రు పిల్ల‌ల‌కు క‌లిపి 2 హెక్టార్లు లేదా అంత‌కంటే త‌క్కువ భూమి ఉన్న కుటుంబాల‌ను చిన్న‌, స‌న్న‌కారు రైతు కుటుంబంగా తాజా మార్గ‌ద‌ర్శ‌కాల్లో ప్ర‌భుత్వం నిర్వ‌చించింది. త‌ప్పుడు ధ్రువ‌ప‌త్రాల‌తో స‌హాయం పొందిన‌ట్లు తేలితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. కిసాన్ స‌మ్మాన్ ప‌థ‌కం సాయం తొలి విడ‌త‌గా మార్చి మొద‌టి వారంలో ప్ర‌భుత్వం రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జ‌మ చేసే అవ‌కాశ‌ముంది.


Tags:    

Similar News