ఆ కేంద్ర మంత్రి సైకిల్ మీద ఆఫీసుకొచ్చారు!

Update: 2019-06-03 08:50 GMT
వృత్తి రీత్యా ఆయ‌నో డాక్ట‌ర్. అయితే.. రాజ‌కీయాల మీద ఉన్న మ‌మ‌కారంతో పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వ‌ట‌మే కాదు.. తాజా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా విజ‌యం సాధించిన ఆయ‌న‌.. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిగా ఎంపిక‌య్యారు. త‌న ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని స్వీక‌రించేందుకు సైకిల్ మీద ఆఫీసుకు వ‌చ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు కేంద్ర‌మంత్రి హ‌ర్ష వ‌ర్థ‌న్.

ప్ర‌జ‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌ట‌మే త‌న క‌ర్త‌వ్య‌మ‌ని.. అందుకే బాధ్య‌త‌ల్ని చేప‌ట్టే రోజు నుంచే ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌ను ప్ర‌చారం చేసేందుకు వీలుగా తాను సైకిల్ మీద ఆఫీసుకు వ‌చ్చిన‌ట్లుగా కేంద్ర‌మంత్రి వెల్ల‌డించారు. సైకిల్ ప్ర‌యాణం ఆరోగ్యానికే కాదు.. ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఢిల్లీలోని త‌న నివాసం నుంచి ఆరోగ్య శాఖ కార్యాల‌యానికి సైకిల్ మీద వ‌చ్చిన ఆయ‌న మంత్రి బాధ్య‌త‌ల్ని స్వీక‌రించారు. ఆరోగ్య రంగంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీ దృక్ప‌థాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని.. ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్య‌క‌ర జీవ‌న‌శైలిని అల‌వ‌ర్చుకునేందుకు అవగాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు. జూన్ 3ను ప్ర‌పంచ సైకిల్ దినోత్స‌వంగా  ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేయ‌టం కోసం తాను సైకిల్ మీద కార్యాల‌యానికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. కేంద్ర‌మంత్రి కోరుకున్న‌ట్లే ఆయ‌న సైకిల్ ప్ర‌యాణానికి భారీప్ర‌చారం వ‌చ్చింది. మ‌రి.. ఆయ‌న ప‌ని తీరు కూడా ఇదే స్థాయిలో వినూత్నంగా ఉంటే బాగుంటుంది. మ‌రి.. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఏం చేస్తారో చూడాలి.


Tags:    

Similar News