ఢిల్లీలో గవర్నర్‌ను ఆ మాట అన్నారా?

Update: 2015-06-12 04:26 GMT
మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన గవర్నర్‌ నరసింహన్‌కు గురువారం కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించిన అంశాల్ని చర్చించే క్రమంలో.. గవర్నర్‌గా తానేం చేయగలనని అన్న మాటకు కేంద్రమంత్రి ఒకరు కాస్త అడ్డు తగిలినట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో రెండు రాష్ట్రాల గవర్నర్‌గా ఏం చేయాలన్న విషయాల్ని గవర్నర్‌కు గుర్తు చేయటం మరో పరిణామంగా చెబుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒకేలా వ్యవహరించాల్సిన గవర్నర్‌ అలా చేయటం లేదన్న విమర్శకు.. కేంద్రమంత్రి ఒకరు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. తన సంభాషణల్లో ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించటం గమనార్హం.

పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న మాటను సూటిగా ప్రస్తావించని సదరు మంత్రి.. మీరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమానంగా వ్యవహరించలేదన్న సమాచారం మా దగ్గర ఉంది. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారంటూ చేసిన వ్యాఖ్యకు గవర్నర్‌ తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారని.. ఇందులో భాగంగా సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

తాను ఇద్దరిని ఒకేలా చూస్తున్నానని చెప్పటమే కాదు.. తన వాదనలో ఆ విషయాన్ని స్పష్టం చేసేందుకు విపరీతంగా ప్రయత్నించారన్న భావన ఉంది. అంతేకాదు.. ఒక ముఖ్యమంత్రితో మీకు వచ్చిన సమస్య ఏమిటంటూ.. పేరుతో సహా ప్రస్తావించిన సమయంలో గవర్నర్‌ కాస్త ఇబ్బందికి గురైనట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మీరేం చేస్తారో తెలీదు.. మాకు మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య లల్లి లేకుండా.. ఎవరి పనులు వారు చేసుకునేలా చూడాలన్న స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. కేంద్రం మాటలు చెబుతుంది కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అది సాధ్యమయ్యే యవ్వారమేనా?

Tags:    

Similar News