కరోనా : యూపీకి క్యూ కడుతున్న అమెరికా కంపెనీలు !

Update: 2020-04-29 17:30 GMT
కరోనా మహమ్మారి ..చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలో ఇప్పటికీ కరోనావైరస్ పూర్తిగా అదుపులోకి రాలేదు. కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన చైనా నుంచి అనేక బహుళజాతి సంస్థలు చైనా నుండి బయటికి రావాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలనుకునే బహుళజాతి కంపెనీలకు ముఖ్యంగా అమెరికాకు చెందిన సంస్థలకు ఇప్పుడు భారతదేశం మెరుగైన అవకాశంగా కనిపిస్తోంది.

ఇప్పుడు అనేక సంస్థలు భారతదేశంలో తమ సంస్థలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఇప్పటికే మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉంది. చైనాను వీడనున్న 100 కంపెనీలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి సిద్ధార్థ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని అవకాశంగా మలచుకునేందుకు ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కృషి చేస్తున్నారని చెప్పారు.

మంగళవారం దాదాపు 100 అమెరికా కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుపగా, చాలా కంపెనీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఆసక్తి వ్యక్తం చేశాయని సింగ్ తెలిపారు. ఆసక్తి కనబరిచిన వాటిలో లాజిస్టిక్స్, శాస్త్ర సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఉన్నాయని సిద్ధార్థ్ సింగ్ చెప్పారు. వారు ఇక్కడ తమ సంస్థలు ఏర్పాటు చేయడానికి సముఖంగా ఉన్నారని అయన తెలిపారు. అడోబ్, బోస్టన్ సైంటిఫిక్, ఇతర యూపీఎస్ కంపెనీలు యూపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.
Tags:    

Similar News