బీజేపీకి దిమ్మ తిరిగే స‌వాలు విసిరిన యూపీ మంత్రి!

Update: 2018-10-24 07:14 GMT
అవును. మీరు చ‌దివింది నిజ‌మే. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి ఒక‌రు బీజేపీ అధినాయ‌క‌త్వానికి సంచ‌ల‌న స‌వాలు విసిరారు. అయితే.. ఆయ‌న బీజేపీకి చెందిన నేత కాదు. యూపీలో ఉన్న‌ది బీజేపీ స‌ర్కారు క‌దా? అన్న సందేహం అక్క‌ర్లేదు. చిన్న చిన్న పార్టీలు కొన్నింటితో క‌లిసి బీజేపీ కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసింది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మితో పోటీ చేసినా.. బీజేపీకి సొంతంగా భారీగా సీట్లు వ‌చ్చిన చందంగానే యూపీలోనూ అదే ప‌రిస్థితి. అయితే.. ముంద‌స్తుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వేరే పార్టీకి చెందిన నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఆయ‌న తాజాగా బీజేపీ అధినాయ‌క‌త్వానికి సంచ‌ల‌న స‌వాలు విసిరారు. చారిత్ర‌క లాల్ ఖిలా పేరును మోడీ స‌ర్కారు మారుస్తుందా? అని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. పేరు మార్చండి లేకుంటే కూల్చేయాలంటూ ఆయ‌న స‌వాలు విసిరారు. ఇంత‌కీ ఇంత‌టి స‌వాలు విసిరిన నేత ఎవ‌రు? ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమంటే.. సుహేల్ దేవ్ భార‌తీయ స‌మాజ్ పార్టీ అధ్యక్షుడే ఓం ప్ర‌కాష్ రాజ్ భ‌ర్‌. యూపీలోని యోగి స‌ర్కారుకు ఉన్న మిత్ర‌ప‌క్షాల్లో ఆయ‌న‌ది ఒక‌టి.  ప్ర‌స్తుతం ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమం.. దివ్యాంగుల సాధికార‌త మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇటీవ‌ల  చారిత్ర‌క ప్రాంతాల పేర్ల‌ను మారుస్తూ యూపీ స‌ర్కారు తీరుపై ఆయ‌న గుర్రుగా ఉన్నారు. అల‌హాబాద్ పేరును ప్ర‌యాగ‌రాజ్ గా మారుస్తూ యోగి స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌టం.. దీనిపై మండిప‌డుతున్న ప‌లువురిలో రాజ్ భ‌ర్ ఒక‌రు. ఇలా పేరు మార్చ‌టం స‌రికాద‌న్నారు. ఇదిలా ఉంటే.. అల‌హాబాద్ పేరు మార్చ‌టంపై కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్ మెచ్చుకోవ‌టంతో ఆయ‌న కోపం న‌శాళానికి అంటింది. మొగ‌ల్స్ పెట్టిన పేర్ల‌ను మార్చుకుంటూ పోతే వంద పేర్ల‌ను మార్చాల్సి వ‌స్తుంద‌న్న‌ది ఆయ‌న వాద‌న‌.

యోగి తీసుకున్న నిర్ణ‌యాన్ని కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న గిరిరాజ్‌ మ‌ద్ద‌తు ప‌ల‌క‌టాన్ని త‌ప్పు ప‌డుతున్న ఆయ‌న‌.. బీహార్ కు చెందిన గిరిరాజ్.. ఆయ‌న న‌డుస్తున్న బీటీ రోడ్డు ఆయ‌న తాత వేశారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. షేర్ షా సూరి వేసిన బీటీ రోడ్డు మీద కేంద్ర‌మంత్రి న‌డుస్తున్నార‌ని.. ఆ విష‌యాన్ని ఆయ‌న గుర్తిస్తే మంచిద‌న్నారు. చేయ‌టానికి ప‌ని లేక‌నే ఇలా పేర్లు మారుస్తారున్నారంటూ మండిప‌డ్డారు. ముందు మంచి రోడ్లు వేసి.. ఆ త‌ర్వాత పేర్లు మార్చే ప‌ని మీద దృష్టి పెట్టాలంటూ సెటైర్లు వేయ‌ట‌మే కాదు.. లాల్ ఖిలా పేరు మార్చే ధైర్యం ఉందా? అంటూ స‌వాలు విసిరి క‌మ‌ల‌నాథుల‌కు క‌రెంటు షాక్ త‌గిలేలా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News