ఇంత జనం వచ్చినా డౌట్ ఎక్కడో కొడుతోందా బాబూ...?

Update: 2022-05-07 04:29 GMT
చంద్రబాబు టీడీపీ అధినాయకుడు. ఆయన రాజకీయ వ్యూహాలను పక్కాగా రచిస్తారు. అలాగే జనాల పల్స్ ని కూడా బాగానే పట్టుకుంటారు. మరి గతంలో బాబు టూర్లకు ఈసారి టూర్లకు మధ్య కచ్చితమైన తేడా అయితే ఉంది. అదేంటీ అంటే సిక్కోలు జిల్లా నుంచి టూర్లు  మొదలుపెడితే గోదావరి జిల్లాల దాకా అన్ని చోట్లా బాబుకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.

అఫ్ కోర్స్ అందులో అత్యధికశాతం టీడీపీ వారే ఉన్నారు. అలా అనుకున్నా టీడీపీ ఇపుడు జోష్ మీద ఉంది అని సంబరపడాలి కదా. ఇక చూడబోతే వచ్చిన జనాలు బాబు చెప్పినది శ్రద్ధగా వింటున్నారు. కొందరైతే తమ బాధలను కూడా ఆయనకు చెప్పుకుంటున్నారు. మహిళలు పెద్ద ఎత్తున బాబు రోడ్ షోలకు అటెండ్ అవుతున్నారు.

మరి ఇంతలా జనాలు వస్తున్నా బాబు ఎందుకు పొత్తుల పాట వినిపిస్తున్నారు అన్నదే తమ్ముళ్లకు అర్ధం కావడంలేదుట. ఆ మాటకు వస్తే పొత్తుల పేరిట బాబు టీడీపీని తానుగా తక్కువ అంచనా వేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. అదే విధంగా తమ్ముళ్ళ పౌరుషాన్ని కూడా ఆయన లైట్ తీసుకుంటున్నారా అన్నది కూడా మరో చర్చ.

ఇక చంద్రబాబు తన మీటింగులలో అంటున్న మాట ఒకటి ఆయన ఎన్నికల వ్యూహాలు మరోలా ఉన్నాయి అని అంటున్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా సింగిల్ డిజిట్ కూడా వైసీపీకి రాదు అన్నది బాబు మాట. మరి అంతలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నపుడు పొత్తుల గురించి ఎందుకు పాకులాడుతున్నారు అంటే బాబు ఏం సమాధానం చెబుతారు అంటున్నారు.

అంటే వచ్చిన జనాలను తెచ్చిన జనాలు అనుకుంటున్నారా లేక వారు వచ్చి తన మీటింగ్ విన్నా కూడా ఓటు టీడీపీకే వేస్తారో లేదో అని డౌట్ పడుతున్నారా అని కూడా చర్చగా ఉంది. నిజానికి సభలకు  వచ్చే జనాలు వేరు, ఓటేసేటపుడు ఉండే మూడ్ వేరు. అది ఎన్నో ఎన్నికల నుంచి రుజువు అవుతూ వచ్చింది.

అలనాడు ఎన్టీయార్ విషయానికే వస్తే 1983 నుంచి ఆయన సభలకు జనాలు వస్తూనే ఉన్నారు. 1989లో కూడా అలాగే వచ్చారు, కానీ ఎన్టీయార్ ఆ ఎన్నికల్లో  ఓడిపోయారు. మరి దాన్ని బట్టే సభలకు వచే జనాలకూ ఎన్నికలకు అసలు సంబంధం లేదని అర్ధమవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కి వచ్చే జనాలు ఎవరికైనా వస్తారా. కానీ ఆయన 2019 ఎన్నికల్లఒ రెండు చోట్లా ఓడిపోయారు.

అంటే సభకు వచ్చేవారు అంతా ఓటేస్తారు అనుకుంటే పొరపాటే. ఈ రాజకీయ తెలివిడి ఉంది కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం చూస్తున్నారు అని అంటున్నారు. ఇక పొత్తుల పేరిట బాబు మాట్లాడడం ద్వారా అదే జనాలకు మరో సందేశం పంపిస్తున్నారు. వైసీపీ బలంగా ఉంది, ఓడించడం ఒక్కరి వల్ల కాదూ అని.

మరి ఇదే కదా జనంలోకి బాగా వెళ్తే  టీడీపీ మీద వ్యతిరేక సంకేతాలను పంపిస్తుంది అని అంటున్నారు.  మొత్తానికి చూస్తే ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చినా చంద్రబాబుకు ఎందుకో డౌట్ ఉంది,  ఎదురుగా జనాలను చూసినపుడు ఫుల్ జోష్ లో మాట్లాడుతున్నా ఆ తరువాత మాత్రం పొత్తులు ఉండాల్సిందే అంటున్నారు అంటే ఇంకా జనం మూడ్ ఏంటి అన్నది బాబుకు అంతు చిక్కడంలేదు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News