ఉప్ప‌ల్ స్టేడియంకు ధోనీ వ‌స్తే అలా చేస్తాడ‌ట‌!

Update: 2018-10-13 04:59 GMT
హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియం గురించి తెలీని వాళ్లు ఉండ‌రు. మ‌హాన‌గ‌రానికి కాసింత దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. అత్యాధునిక స‌దుపాయాల‌తో ఉప్ప‌ల్ కు కొత్త గుర్తింపును తీసుకురావ‌టంలో స్టేడియం స‌క్సెస్ అయ్యింద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ స్టేడియంలో టీమిండియా వ‌ర్సెస్ వెస్టీండీస్ ల మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ న‌డుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఉప్ప‌ల్ స్టేడియంకు సంబంధించి ఒక సెంటిమెంట్ పై త‌ర‌చూ చ‌ర్చ జరుగుతుంటుంది. అదేమంటే.. ఈ స్టేడియంకు వాస్తు దోషం ఉన్న‌ట్లు చెబుతారు. ఈ కార‌ణంగానే ఈ స్టేడియం ప్రారంభించిన నాటి నుంచి అతిధ్య జ‌ట్టు ఓడిపోవ‌టం ఒక అల‌వాటుగా చెబుతారు. దీనంత‌టికి కార‌ణంగా వాస్తు దోషంగా చెబుతూ.. దాని నివార‌ణ‌కు భారీ ఏర్పాట్లు చేయటాన్ని గుర్తు చేసుకుంటారు. ఉప్ప‌ల్ లో జ‌రిగే ప్ర‌తి మ్యాచ్ లో భార‌త్ ఓడిపోవ‌టంతో.. ఈ దోష నివార‌ణ‌కు ఏం చేస్తే బాగుంటుంన్న ప్ర‌శ్న ప‌లువురి మ‌దిలో మెదిలింది. కొన్ని ప్ర‌య‌త్నాల అనంత‌రం అస‌లు స్టేడియంకు వాస్తు ఏ మాత్రం సానుకూలంగా లేద‌ని తేల్చారు.

ఈ వాస్తు దోషాన్ని అధిగ‌మించ‌టానికి వీలుగా.. తెగ ఆలోచించిన త‌ర్వాత వాస్తు శాస్త్రానికి అధిదేవుడైన విఘ్నేశ్వ‌రుడి గుడిని నిర్మించాల‌ని డిసైడ్ అయ్యారు. అలా ఉప్ప‌ల్ స్టేడియంలో వినాయ‌కుడి గుడి వ‌చ్చేసింది. మామూలు రోజుల్లో ఈ గుళ్లో సంద‌డి ఉండ‌దు కానీ.. మ్యాచ్ జ‌రిగే రోజుల్లో మాత్రం ఈ గుడి కిట‌కిట లాడుతుంద‌ని చెబుతారు.

చివ‌ర‌కు సామాన్య భ‌క్తులే కాదు.. ఎంఎస్ ధోనీ లాంటి ప్ర‌ముఖుడు కూడా ఈ గుడికి రెగ్యుల‌ర్ గా వ‌స్తార‌ట‌. ఉప్ప‌ల్ స్టేడియంలో ధోనీ ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా.. త‌న ప్రాక్టీస్ పూర్త అయ్యాక గుడి వ‌ద్ద‌కు వ‌చ్చి స్వామి ద‌ర్శ‌నం చేసుకోవ‌టం ఒక అల‌వాటుగా చెబుతున్నారు. ఆ మాట‌కు వ‌స్తే.. మ‌రో క్రికెట‌ర్ క‌ర్ణ్ శ‌ర్మ కూడా గుడికి వ‌స్తార‌ని చెబుతున్నారు.

ఇక‌.. వాస్తు దోషం ముచ్చ‌ట  విష‌యానికి వ‌స్తే.. ఈ గుడి క‌ట్ట‌టానికి ముందు వ‌రుస ఓట‌మి మ‌ర‌క నుంచి.. టీమిండియా గెలుపుకు కేరాఫ్ అడ్ర‌స్ అన్న‌ట్లుగా మారింద‌ని చెబుతారు. ఈ గుడిని 2011లో నిర్మించారు. దానికి ముందు జ‌రిగిన మ్యాచ్ ల‌లో టీమిండియా ఓట‌మి పాలైతే.. గుడిని నిర్మించిన త‌ర్వాత నుంచి జ‌ట్టు ఏదైనా.. టీమిండియాతో త‌ల‌ప‌డితే భార‌త్ దే విజ‌య‌మ‌న్న మాట గ‌ణాంకాల సాక్షిగా చెబుతున్నారు. మ‌రి.. తాజా మ్యాచ్ ఫ‌లితం ఎలా ఉంటుందో చూస్తే.. వాస్తు సెంటిమెంట్ పై మ‌రింత న‌మ్మ‌కం పెర‌గ‌టం ఖాయం. 
Tags:    

Similar News