ప్రధాని మోడీ.. సీఎం జగన్.. గౌతమ్ ఆదానీలకు అమెరికా కోర్టు సమన్లు

Update: 2022-09-02 06:31 GMT
ప్రవాసాంధ్రుడు ఒకరు అమెరికా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలు ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కు స్పందించిన అమెరికా కోర్టు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీలకు సమన్లు పంపింది. అవినీతి.. పెగాసస్ స్పైవేర్.. అమెరికాకు అక్రమంగా నగదు తరలింపు తదితర ఆరోపణలు చేసిన ప్రవాసాంద్రుడి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

ఏపీకి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ అమెరికాలోని కొలంబియా జిల్లాలో నివాసం ఉంటున్నారు. రిచ్ మండ్ లో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు అయిన ఆయన.. ఈ ఏడాది మే 24న అమెరికా స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన మొత్తం 53 పేజీల పిటిషన్ లో ఆయన పలు ఆరోపణలు చేశారు.

ప్రధాని మోడీ.. సీఎం జగన్.. పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీతో పాటు ప్రపంచ ఆర్థిక సదస్సు వ్యవస్థాపకుడు కమ్ ఛైర్మన్ క్లాస్ ష్వాబ్ తో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. వీరందరికి జులై 22న కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది,

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ.. జగన్.. అదానీలకు మాత్రం ఆగస్టు నాలుగున.. ష్వాబ్ కు ఆగస్టు 2న సమన్లు అందజేశారు. అంతేకాదు.. వారికి కోర్టు పంపిన సమన్లు అందిన ఆధారాలను ఆగస్టు 19న లోకేశ్ కోర్టును అందజేశారు. ఆయన ప్రధాన ఆరోపణ ఏమంటే.. ఈ ప్రముఖులు భారీ అవినీతికి పాల్పడ్డారని.. పెద్ద ఎత్తున డబ్బును అమెరికాకు తరలించారని పేర్కొన్నారు. అంతేకాదు.. తమ రాజకీయ ప్రత్యర్థులపై పెగాసన్ స్పైవేర్ ను ఉపయోగించినట్లుగా ఆరోపించారు.

ఈ పిటిషన్ పై న్యూయార్కుకు చెందిన రవి బాత్రా రియాక్టు అయ్యారో. లోకేశ్ ఉయ్యూరుకు పెద్దగా పని పాటా లేదని.. ఆయన అనవసరమైన పిటిషన్లు దాఖలు చేస్తుంటారన్నారు. అమెరికాకు సన్నిహిత దేశమైన భారత్ ను అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటివి చేస్తుంటారని పేర్కొన్నారు.

గతంలో  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీదా కేసులు వేశారని.. వాటిని అప్పట్లో కొట్టించేసినట్లుగా చెబుతున్నారు. అయినప్పటికీ విచ్చలవిడిగా కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. ఏమైనా.. ఒక ప్రవాస ఆంధ్రుడి కారణంగా జారీ అయిన అమెరికా కోర్టు సమన్లకు సంబంధించి ఏం జరగనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News