హెచ్ 1 బీ వీసాల‌పై అమెరికా క్లారిటీ..కాస్తంత ఊర‌టే!

Update: 2019-06-22 05:19 GMT
ఫారిన్ కంపెనీలు సేక‌రించే డేటాను లోక‌ల్ గానే స్టోర్  చేయాలని కోరే దేశాల‌కు హెచ్ 1బీ వీసాల జారీలో కోత వేయ‌నున్న‌ట్లుగా జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ వార్త‌లతో దేశంలోని హెచ్ 1బీ వీసాల మీద ఆశ‌లు పెట్టుకున్న వారికి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వీసాల్లో కోత పెడితే త‌మ డాల‌ర్ డ్రీమ్స్ కు గండి ప‌డుతున్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటివేళ‌.. జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఖండిస్తూ అగ్ర‌రాజ్యం అమెరికా తాజాగా ఒక వివ‌ర‌ణ‌ను విడుద‌ల చేసింది.

డేటాను స్థానికంగా భ‌ద్ర‌ప‌ర్చాల‌ని కోరే దేశాల‌కు హెచ్ 1బీ వీసాల జారీలో కోత పెడ‌తామంటూ వ‌స్తున్న వార్త‌లు నిజం కావ‌ని.. అలాంటి ఆలోచ‌న ట్రంప్ స‌ర్కారుకు లేద‌ని స్ప‌ష్టం చేసింది. డేటా స్టోరేజీ విష‌యంలో భార‌త్.. అమెరికాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి హెచ్ 1 బీ వీసా జారీకి ఎలాంటి సంబంధం లేద‌ని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా నోట్ రిలీజ్ చేసింది.

ఏ దేశాన్ని ల‌క్ష్యంగా చేసుకొని నిర్వ‌హించాల‌న్న‌ది త‌మ ఉద్దేశం కాద‌ని.. దేశాల స‌రిహ‌ద్దును దాటిన స‌మాచారం స్వేచ్చ‌గా ప్ర‌యాణిచాల్సిన అవ‌స‌రంపై అమెరికా భార‌త్ తో చ‌ర్చిస్తోంద‌ని.. అంత మాత్రాన దానికి హెచ్ 1బీ వీసాల‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. డేటాను గ్లోబ‌ల్ స‌ర్వ‌ర్ల‌లో కాకుండా లోకల్ గా భ‌ద్ర‌ప‌ర్చాల్సి వస్తే వ్య‌యాలు పెరుగుతాయ‌ని విదేశీ కంపెనీలు ఆందోళ‌న చెందుతున్నాయి. వీటి ఇబ్బందిని గుర్తించిన అమెరికా.. ఇలా కోరుతున్న దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. డేటాను స్థానికంగా స్టోర్ చేయాల‌ని కోరుతున్న దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టి. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. హెచ్ 1 బీ వీసాల జారీపై ఎలాంటి కోత లేదంటూ అమెరికా ఇచ్చిన వివ‌ర‌ణ దేశ వాసుల‌కు తీపిక‌బురుగా చెప్పక త‌ప్ప‌దు.
Tags:    

Similar News