ట్రంప్ కొత్త నిర్ణ‌యం...భార‌తీయుల‌కు షాకేనా?

Update: 2019-08-23 05:03 GMT
వివ‌క్ష‌త‌కు సుప‌రిచిత చిరునామా అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో క‌ల‌వ‌రాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. అమెరికాలోకి అక్రమ వలసల నిరోధానికి కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్న ఆయన..ఇప్పుడు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. అమెరికాలో పుట్టినవారికి జన్మహక్కుగా పౌరసత్వాన్ని కల్పించే విధానం హాస్యాస్పమని - ఆ విధానాన్ని రద్దుచేస్తామన్నారు. వైట్‌ హౌస్ సాక్షిగా ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెలువ‌రించారు.

వైట్‌ హౌస్ వ‌ద్ద మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ సంద‌ర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...అమెరికాలో జన్మించిన వారికి ఆటోమేటిక్‌ గా ఆ దేశ పౌరసత్వాన్ని కల్పించే ప్ర‌స్తు విధానం  స‌రైంది కాద‌న్నారు. `` పౌరసత్వం జన్మహక్కుగా ఉండటం చాలా హాస్యాస్పదమైనది. ఈ విధానం గురించి మేము తీక్షణంగా ఆలోచిస్తున్నాం`` అని చెప్పారు. మా గడ్డ పై పుట్టిన ఇతర దేశస్థుల పిల్లలకు పౌరసత్వం జన్మహక్కు గా లభిస్తున్నది. సరిహద్దులు దాటివచ్చి మా దేశంలో పిల్లలను కంటున్నారు. దాంతో వారికి అమెరికా పౌరసత్వం లభిస్తున్నది. ఈ విధానంపై మేము చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నాం అని అన్నారు.

పౌరసత్వం జన్మహక్కని అమెరికా రాజ్యాంగ 14వ సవరణ స్పష్టం చేస్తోంది. అమెరికాలో పుట్టిన వారంతా దేశ పౌరులేనని ఆ సవరణ పేర్కొంటోంది. అయితే, అమెరికాలో పుట్టిన పిల్లలు ఆటోమేటిక్‌ గా అమెరికా పౌరులుగా మారే బర్త్ రైట్ సిటిజన్‌ షిప్ విధానాన్ని రద్దుచేస్తామని గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది. ట్రంప్ 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ విధానాన్ని రద్దుచేస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న భారత సంతతి అభ్యర్థి - కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్ (డెమోక్రటిక్ పార్టీ) ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను కట్టిపెట్టి దేశ రాజ్యాంగం చదువడంపై ట్రంప్ సీరియస్‌ గా దృష్టిసారించాలని ట్వీట్ చేశారు. కాగా, అమెరికాలో నివసిస్తున్న భార‌తీయ ఎన్నారైల‌కు తాజా నిర్ణ‌యం షాక్ వంటిద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.


Tags:    

Similar News