అమెరికా వ‌ర్సెస్ చైనా వార్ మొద‌ల‌యిన‌ట్టేనా?

Update: 2022-09-05 17:30 GMT
ప్ర‌పంచంలో ఏకైక అగ్ర రాజ్యం.. అమెరికా. దీన్ని అందుకోవ‌డానికి పోటీ ప‌డుతున్న మ‌రో దేశం.. చైనా. ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం ఈ రెండు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తైవాన్‌ను ఆక్ర‌మించాల‌ని చూసిన చైనాకు అమెరికా ఇటీవ‌ల షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రూ.8500 కోట్ల విలువైన క్షిప‌ణుల‌ను, యుద్ధ విమానాల‌ను తైవాన్‌కు అమెరికా అందిస్తోంది. అలాగే త‌న యుద్ధ విమాన వాహ‌క నౌక‌ను ద‌క్షిణ చైనా స‌ముద్రంలోకి పంపి చైనాకు ధీటుగా బ‌దులిచ్చింది.

దీనిపై తీవ్రంగా మండిప‌డిన చైనా.. అమెరికాకు తీవ్ర హెచ్చరిక‌లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా చ‌ర్య‌లు త‌మ సౌర్వ‌భౌమాధికారాన్ని ప్ర‌శ్నించ‌డ‌మేన‌ని చైనా మండిప‌డింది. ఇందుకు త‌గిన మూల్యం అమెరికా చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

ఇందులో భాగంగా సెప్టెంబ‌ర్ 5న చైనా.. అమెరికాపై సైబ‌ర్ దాడుల‌కు దిగింది. దీనికి ప్ర‌తిగా అమెరికా కూడా చైనాపై సైబ‌ర్ దాడులు చేప‌ట్టింది. తాజాగా, అమెరికా తమ దేశంలోని విద్యుత్, ఇంటర్నెట్ సంస్థలు, ఓ విశ్వవిద్యాలయంపై సైబర్ దాడి చేసింద‌ని చైనా ఆరోపించింది. నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్లపై అమెరికా దాడి చేస్తోందని చైనా పోలీస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. ఇంత‌కుముందు జూన్ లో కూడా ఆ వర్సిటీకి చెందిన కంప్యూటర్లపై దాడి జరిగినట్లు చైనా నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది.

అలాగే తమ కమర్షియల్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్విహూ 360 టెక్నాలజీ కంపెనీ అమెరికా సైబ‌ర్ దాడుల‌ను గుర్తించిందని చైనా తెలిపింది. అయితే, ఏ విధంగా ఈ దాడి జరిగిందన్న వివరాలు వెల్ల‌డించ‌లేదు. చైనా చేసిన ఈ ఆరోపణ‌లపై ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఇప్పటివరకు స్పందించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక తమ వాణిజ్య సంబంధమైన అంశాలపై చైనా సైబ‌ర్ దాడులు చేస్తోందని అమెరికా మండిప‌డింది. త‌మ ర‌క్ష‌ణ రంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చైనా రెచ్చిపోతోంద‌ని ధ్వ‌జ‌మెత్తింది. సైబర్ సామర్థ్యాన్ని సైబ‌ర్ దాడుల కోసం చైనా దుర్వినియోగం చేస్తోందని అమెరికా కూడా ఇప్పటికే పలుమార్లు ఆరోప‌ణ‌లు చేసింది.

అంతేగాక, చైనా మిలటరీ కార్యాలయాల‌పై అమెరికా నేరపూరిత కేసులు నమోదు చేసింది. చైనా ఆర్మీ, భద్రతా మంత్రిత్వ శాఖ ఈ సైబర్ దాడులు చేస్తోందని అమెరికా విమ‌ర్శించింది. తైవాన్ కు తాము అండ‌గా ఉండ‌టాన్ని చైనా త‌ట్టుకోలేక‌ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంద‌ని అమెరికా ధ్వ‌జ‌మెత్తింది.  ఈ నేపథ్యంలో చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి.

కాగా సైబర్ పరిశోధనల్లో చైనా, అమెరికాతో పాటు రష్యా ప్ర‌పంచంలోనే ముందంజలో ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. రాబోయే కాలంలో ఆయుధాలు వాడ‌కుండానే సైబ‌ర్ యుద్ధాల‌తో ఆయా దేశాల్లో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను కుప్ప‌కూల్చ‌వ‌చ్చ‌ని అంటున్నారు. క్షిప‌ణులు, యుద్ధ విమానాలు, పైట‌ర్ బాంబ‌ర్స్ ఇలా దేన్నీ సైబ‌ర్ దాడులతో ప‌నిచేయ‌కుండా చేయొచ్చ‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News