ప్ర‌తిప‌క్షం ఫైర‌వుతోంది సీఎంగారు

Update: 2016-10-02 06:49 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై దూకుడ‌గా వెళ్లాల‌ని నిర్ణ‌యించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ క్ర‌మంలో త‌న జోరు పెంచుతోంది. రైతు సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని  నిర్ణయించింది. అదేవిధంగా రైతులకు భరోసా కల్పించేందుకు పల్లె బాట చేపట్టాలని నిర్ణయించింది. గాంధీ భవన్‌ లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క - శాసనసభలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి - శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ - మాజీ ఎంపిలు వి. హనుమంత రావు - పొన్నం ప్రభాకర్ - మల్లు రవి - మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య - ప్రసాద్‌ కుమార్ - సబితా ఇంద్రారెడ్డి - కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ - ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ - కిసాన్ - ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. కోదండ రెడ్డి - మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఈ మేర‌కు త‌మ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు.

రైతులు లోగడ కరవుతో నాలుగు పంటలు నష్టపోయినా, ఈ సారి వరదలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా దాట వేయడంపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డ్డారు.  ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తాను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించినప్పుడు రైతు సమస్యలపై పార్టీ పోరాటం చేయాలని సూచించారని చెప్పారు. రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ఇంకా మూడో విడత విడుదల చేయలేదని అన్నారు. రుణాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాబట్టి ఈ విషయంలో పార్టీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేసి రైతులకు అండగా ఉండాలని, రైతుల సమస్యలపై టి.పిసిసి పోరాటం చేసేందుకు క్షేత్ర స్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు.క్షేత్ర‌స్థాయిలో జ‌రిపే ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల పార్టీ సైతం బ‌లోపేతం అవుతుంద‌ని ఉత్త‌మ్ వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News