యూపీలో 'ద‌ళిత బంధు' ఎవ‌రు?

Update: 2022-02-10 03:30 GMT
ద‌ళితులు,బ్రాహ్మ‌ణులు అత్య‌ధికంగా ప్ర‌భావితం చేసే యూపీలో ఇప్పుడొక పొలిటిక‌ల్ వార్ నడుస్తోంది.చావు బ‌తుకుల మ‌ధ్య జాతీయ పార్టీ  కాంగ్రెస్ ఉండ‌గా,ఇదే స‌మ‌యంలో ప్రాంతీయ  పార్టీ అత్యంత వేగంగా పుంజుకునేందుకు స‌మాజ్‌వాదీ పార్టీ సిద్ధం అవుతోంది.ప్ర‌ధాన పార్టీలేవీ ఉచిత ప‌థ‌కాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోయినా అభ్య‌ర్థుల‌ను మాత్రం కులాల వారీగా ఎంపిక చేయ‌డంలో అత్యంత చాక‌చ‌క్యంతో న‌డుచుకున్నాయ‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది.

ఈ ద‌శ‌లో ప్ర‌ధాని మోడీ సీన్ లోకి ఎంట‌ర్ అయి, విప‌క్షాల క‌ల‌లు క‌ల్ల‌ల‌ల‌వుతాయని జోస్యం చెబుతున్నారు.అదే సంద‌ర్భంలో బీజేపీ మాత్రం ఈ ఎన్నిక‌ల‌ను ఓ శాంపిల్ స్పేస్ గా తీసుకునేందుకే ఇష్ట‌ప‌డుతోంది.ఇదే స‌మ‌యంలో స‌మాజ్ వాదీ పార్టీ కూడా బ‌లోపేతం అయ్యేందుకు కొన్ని హామీల విష‌య‌మై రైతుల ద‌గ్గ‌ర శ్ర‌ద్ధ తీసుకుంది.ఈ పార్టీ కూడా బీజేపీ మాదిరిగానే సాగుకు ఉచిత విద్యుత్ అంశాన్ని తెర‌పైకి తెచ్చింది.అదేవిధంగా రుణ‌మాఫీని ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ ఇచ్చేందుకు స‌మ‌యాత్తం అవుతోంది.

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అటు బీజేపీ,ఇటు ఎస్పీ ప‌ర‌స్ప‌ర ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రితో త‌ల‌ప‌డుతున్నాయి.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ను తాము అన్నివిధాలా అభివృద్ధి చేశామ‌ని,అనూహ్యంగా రేప‌టి వేళ కూడా ప్ర‌గ‌తి దారుల న‌డిపిస్తామ‌ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్ చెబుతున్నారు.మ‌రోవైపు బీఎస్పీ నేత అఖిలేశ్ యాద‌వ్ కూడా త‌న‌దైన పంథాలో వాగ్బాణాలు సంధిస్తూ వెళ్తున్నారు.రెండు పార్టీలు కూడా హిందుత్వ అజెండాతోనే వెళ్తున్నాయి.

రెండు పార్టీలు కూడా అటు బ్రాహ్మ‌ణ‌, ఇటు ద‌ళిత ఓటు బ్యాంకునే న‌మ్ముకున్నాయి.కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉండేందుకు త‌ప‌న పడుతోంది.ఈ క్ర‌మంలో భాగంగా కొన్ని టిక్కెట్లు సామాజిక వేత్త‌ల‌కు కేటాయించి,త‌న దైన మార్కు ప్ర‌ద‌ర్శించేందుకు ఆరాట‌ప‌డుతోంది.ప్రియాంక గాంధీ మాత్రం మై ల‌డ్కీ హూ ల‌డ్ శ‌క్తి హూన్ అనే నినాదంతో పోరాడేందుకు సిద్ధం అవుతున్నారు.

బీజేపీ భ‌యాలు కూడా ఇదే స‌మ‌యంలో చాలా ఎక్కువ‌గానే ఉన్నాయి.హిందుత్వ రాజ‌కీయం లో తాము నెగ్గుతామో, ఓడుతామో అన్న భ‌యం అయితే వీళ్ల‌లో ఉంది.నిన్న‌టి వేళ మ్యానిఫెస్టో విడుద‌ల చేశారు. వాస్త‌వానికి రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తామ‌న్న ప్ర‌ధాన హామీతో ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల బ‌రిలో త‌ల‌ప‌డేందుకు సిద్ధం అవుతున్నారు.వీటితో పాటు మ‌రికొన్ని క్రియాశీల‌క హామీలు కూడా ఉన్నాయి.అవి ఎలా ఉన్నా కూడా ఇక్క‌డ రైతుల ఓట్లే కీల‌కం కానున్నాయి క‌నుక తెరపైకి ఉచిత విద్యుత్ అంశాన్ని తెచ్చి రాజకీయంగా ప‌బ్బం గ‌డుపుకునేందుకు చూస్తున్నాయి బీజేపీ వ‌ర్గాలు.వీటితో పాటు రూ.ఐదు వేల కోట్ల‌తో వ్య‌వసాయ ప‌థ‌కం ఒక‌టి తీసుకుని రావాల‌ని కూడా భావిస్తున్నారు.

అదేవిధంగా కాలేజీకి వెళ్లే అమ్మాయికు బాలికా విద్య‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో ఉచితంగా స్కూటీ ఇవ్వాల‌ని అనుకుంటున్నారు. దీనినే ఎన్నికల ప్ర‌ణాళిక‌లో ఉంచారు.ఇదే రీతిన మొత్తం 42 అంశాల‌తో కూడిన మ్యానిఫెస్టోను బీజేపీ విడుద‌ల చేయ‌గా,కాంగ్రెస్ మాత్రం ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయంగా త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక ను ఇవాళ విడుద‌ల చేయడం గ‌మనార్హం.

ఇరవై ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయం అని చెబుతోంది.పెద్ద‌గా ఉచిత‌హామీలు లేకున్నా కొవిడ్ వారియ‌ర్స్ విష‌యంలో యాభై ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లింపు అన్న‌ది కాంగ్రెస్ పార్టీ నుంచి  ప్ర‌ధానంగా వ‌స్తున్న ప్ర‌తిపాద‌న‌.అయితే ఇప్ప‌టిక‌పుడు కులాల వారీగా వ‌రాలు ఏమీ లేక‌పోయినా ఆయా వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేసేలా ప‌రోక్ష ప‌ద్ధ‌తిలో కొన్ని ఆక‌ర్ష‌ణ పథ‌కాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ద‌ళిత సామాజిక వ‌ర్గం ఓట్ల‌నే రాబ‌ట్టుకునేందుకు ఇరు ప‌క్షాలు కృషి చేసినా ప‌థ‌కాల ప‌రంగా మాత్రం ప్ర‌త్యేకించి ఓ వ‌ర్గాన్ని అయితే ల‌క్ష్యంగా పెట్టుకోలేదు.
Tags:    

Similar News