ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ .. ..బీపీ పెంచేస్తున్న యూపీ.... ?

Update: 2022-03-06 10:30 GMT
ఈసారి ఎగ్జిట్ పోల్స్ పెంచే టెన్షన్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఉత్తరాదిన జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకం. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు చాలా ప్రాధాన్యత కలిగినవి. బీజేపీ రాజకీయ జాతకాన్ని మొత్తం మార్చే ఫలితాలు ఇవి.  బీజేపీకి చూచాయగా ఈ ఫలితాలు ఎల ఉండబోతాయో తెలుసు కానీ ఎంతో కొంత ఆశ ఉండడం సహజం. దాన్ని నీరుకార్చేలా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఉంటాయా అన్నదే ఇపుడు చర్చ.

నిజానికి ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ ఈ నెల 10న వస్తాయి. దానికంటే మూడు  రోజుల ముందు అంటే ఈ నెల 7న సాయంత్రం పోలింగ్ ఇలా ముగియగానే ప్రముఖ  చానల్స్ లో వరసబెట్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కోటిగా వచ్చేస్తాయి. ఇందులో పేరున్న సంస్థల సర్వేలతో పాటు, చాలా సంస్థల సర్వేల ఫలితాలు  కూడా  వచ్చి పడతాయి.

దాంతో ఏది నిజంలో తేల్చుకోలేక మరో మూడు రోజులు ప్రధాన రాజకీయ పార్టీలు నరకమే చూడాలి. ఈసారి అలాంటి బాధ, భయాలు అయితే బీజేపీలో గట్టిగా ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి మొత్తానికి మొత్తం అయిందింట నాలుగు రాష్ట్రాలు ఎలా  పోయినా ఫరవాలేదు, ఒక్క యూపీలో రిజల్ట్ అనుకూలంగా ఉంటే చాలు అన్నదే ఆలోచన. యూపీని ఒడిసిపడితే చాలు 2024 ఎన్నికల్లో గట్టేకేస్తామన్న ధీమా ఆ పార్టీకి  వస్తుంది.

దాని కంటే ముందు విపక్షాల కూటములు కకావికలం అవుతాయి. సొంత పార్టీలో కూడా అసంతృప్తులకు అడ్డుకట్ట పడుతుంది. అయితే పరిస్థితి చూస్తూంటే యూపీ బీజేపీ చేజారిపోయేలాగానే ఉంది. అదే విధంగా బీజేపీ బీపీని పెంచేలాగానే ఫలితాలు మొత్తం రాబోతున్నాయని కూడా అంటున్నారు. ఆ చేదు నిజాన్ని  ఎగ్జిట్ పోల్స్ పసిగట్టి బయటపెడితే మాత్రం కమలదళానికి మరో మూడు రోజులు నిద్ర లేని రాత్రులే అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకో వైపు చూస్తే యూపీలో మొదట మూడు విడతల పోలింగ్ ముగిసాక బీజేపీకి వంద సీట్లు దాకా తక్కువ పడతాయని అంచనా వేశారు. ఆరు విడతల పోలింగ్ పూర్తి అయిన తరువాత చూస్తే వంద కంటే కూడా ఎక్కువ సీట్లు బీజేపీ ఈసారి నష్టపోతోంది అంటున్నారు. అంటే 2017లో గెలుచుకున 312 సీట్ల నుంచి ఏ 180కో పడిపోతే మాత్రం బీజేపీకి పీఠం దక్కడం దాదాపుగా అసాధ్యం.

మరో వైపు చూస్తే  యూపీ అసెంబ్లీలో మొత్తం సీట్లు 403 ఉన్న్నాయి. సాధారణ మెజారిటీ రావాలీ అంటే 202 సీట్లు ఏ పార్టీకైనా రావాలి. బీజేపీ కనుక వంద సీట్లు కోల్పోతే ఏ 212 సీట్లతో అయినా తిరిగి అధికారంలోకి వస్తుంది. అలా కాకుండా ఏకంగా 130 దాకా సీట్ల కోత పడితే మాత్రం ఇక కుర్చీ మీద ఆశలు వదులుకోవాల్సిందే. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెబుతాయో అన్న టెన్షన్ అయితే బీజేపీకి ఉంది.

ఇక ఇప్పటికే తలపండిన రాజకీయ పార్టీ నేతలు, విశ్లేషకుల అంచనా అయితే యూపీలో ఈసారి ఏ పార్టీకి కూడా పూర్తి  మెజారిటీ రాదు, హంగ్ వస్తుంది అని అంటున్నారు. అంటే కింగ్ మేకర్ గా బీఎస్పీ తో పాటు కాంగ్రెస్ కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయని కూడా లెక్కలు వేస్తున్నారు. మరి ఈ పరిణామాలు చూసినా బీజేపీ యూపీ మీద ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు.
Tags:    

Similar News