గోర‌ఖ్‌ పూర్ డాక్ట‌ర్ అరెస్ట్‌..కొత్త ట్విస్ట్‌

Update: 2017-09-02 08:29 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన గోర‌ఖ్‌ పూర్ బీఆర్డీ మెడిక‌ల్ కాలేజీలో చిన్నారులు మృతిచెందిన కేసులో మ‌రో మ‌లుపు చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో చిన్నారులకు ఆక్సిజ‌న్ అందించాడంటూ ఇటీవ‌ల హీరోగా కీర్తించ‌బ‌డ్డ డాక్ట‌ర్ క‌ఫీల్ ఖాన్‌ ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్డీ కాలేజీలో డాక్ట‌ర్ ఖాన్ ఎన్‌ సెఫ‌లైటిస్ వార్డుకు హెడ్‌ గా ఉన్నారు. ఆయ‌న‌పై వైద్య నిర్ల‌క్ష్యం కింద కేసు వేసి ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న‌డ‌న్న ఆరోప‌ణ‌ల‌పైన కూడా అత‌న్ని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్ప‌టికే మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మందిపై హ‌జ్ర‌త్‌ గంజ్ పోలీస్ స్టేష‌న్‌ లో కేసు న‌మోదు చేశారు.

యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌ పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఈ దవాఖాన ఉంది. ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థకు కొన్ని నెలలుగా 64 లక్షల బకాయిలు చెల్లించకపోవటంతో.. విజ్ఞప్తులు చేసీ చేసీ విసిగిపోయిన సరఫరాదారు దవాఖానకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయటం ఆపివేశాడు. దీంతో ప్రాణవాయువు లేకపోవటంతో.. చికిత్స విభాగంలో ఉన్న చిన్నారులు చూస్తుండగానే పిట్టల్లా రాలిపోయారు. నాలుగురోజుల వ్యవధిలో 63 మంది కన్నుమూశారు. ఆగ‌స్టు రెండో వారంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ నేపథ్యంలో, యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ పై విమర్శల వర్షం కురిసింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. యూపీ ప్రభుత్వం మాత్రం.. చిన్నారుల మృతికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటం కారణం కాదంటూ, తమ వైఫల్యం లేదని చెప్పుకోవటానికి ప్రయత్నించింది. ఇన్ఫెక్షన్లు - ఇతర ఆరోగ్య సమస్యల కారణంగానే పిల్లలు చనిపోయారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తులో అసలు కారణం వెల్లడవుతుందని చెప్పాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్‌ మిశ్రాను వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలిపాయి.

గోరఖ్‌ పూర్‌లోని ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ కొరత వల్ల చిన్నారులు మరణించలేదని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో కమిటీని నియమించిన తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివ‌రించారు. అయితే దవాఖానలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన మాట నిజమేనని గోరఖ్‌ పూర్ జిల్లా యంత్రాంగం అంగీకరించింది. అయితే పిల్లల మరణాలకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటానికి సంబంధం లేదని తెలిపింది.
Tags:    

Similar News