గవర్నరుకు వినతిపత్రం ఇవ్వడం వేస్టట

Update: 2016-08-03 12:17 GMT
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నరుకు పనీపాటు లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. గుడులు గోపురాలకు తిరగడం తప్పించి ఆయనకు వేరే పనిలేదని మండిపడ్డారు.  కృష్ణా పుష్కరాల్లో నాణ్యత లోపాలపై అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీహెచ్ మాట్లాడారు. పుష్కర పనులు ఏమాత్రం బాగాలేవని ఆయన కూడా అన్నారు.  పనులను పర్యవేక్షించాల్సిన గవర్నర్ కూడా విషయాన్ని పక్కనబెట్టేసి గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, వాటి చుట్టూ తిరగడం తప్ప ఆయనకు వేరే పనే లేదంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... గవర్నరును కలిసి ఏం మొర పెట్టుకున్నా ఫలితం లేదని కూడా అన్నారు.

పుష్కర పనులపై గవర్నర్ అలసత్వాన్ని తప్పుబట్టిని వీహెచ్.. నాసిరకం పనులతో పుష్కర నిర్మాణాలు జరుగుతుంటే గవర్నర్ నరసింహన్ ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. విజయవాడ భవానీ ఘాట్ వద్ద నిర్మించిన బ్రిడ్జిని నాసిరకం పనులతో కానిచ్చేశారని, బ్రిడ్జి పిల్లర్ కూలిపోతున్నా పట్టించుకున్నవారే లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని.. పుష్కర ఏర్పాట్లు - పనులు సక్రమంగా లేకపోతే భక్తులకు అసౌకర్యమే కాకుండా ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారముందని ఆయన అన్నారు.

గవర్నర్ పనితీరుపై విరుచుకుపడిన వీహెచ్ ఆ గవర్నరు నుంచి స్పందన కూడా ఉండడం లేదని ఆరోపించారు. గవర్నరుకు అందుతున్న విజ్ఞప్తులన్నీ చెత్తబుట్టలోకే వెళ్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పుష్కర పనులపై శ్రద్ద పెట్టి.. కాంట్రాక్టర్ల పనితీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  రెండు రాష్ట్రాల బాధ్యతలు చూస్తున్న గవర్నరుపై ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పాలక పక్షాలు పలుమార్లు అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల విషయంలో ఒకరిపై ఒకరు కంప్లయింట్లు చేసుకున్నా కూడా ఆయన పరిష్కరించింది లేదు. కేంద్రం వద్ద తేల్చుకోమని సూచించిన సందర్భాలున్నాయి. అలాగే.. పాలక పక్షాలకు వ్యతిరేకంగా విపక్షాలు చేసిన ఫిర్యాదులనూ ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా ఫిరాయింపుల వ్యవహారాల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు గవర్నరుకు పలుమార్లు కంప్లయింట్లు చేసిన సందర్భాలున్నాయి. తాజాగా పుష్కరాల పనుల విషయంలో వీహెచ్ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News