ఎగ్జామ్స్ కి ముందే స్టూడెంట్స్ కి టీకా ... హైకోర్టు నోటీసులు !

Update: 2021-05-08 10:40 GMT
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో 2021 ఏడాదికి జరగాల్సిన బోర్డు పరీక్షలను చాలా రాష్ట్రాలు  వాయిదా వేశాయి   ముఖ్యంగా  ఇంటర్ బోర్ట్ పరీక్షలైతే దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాయిదా పడ్డాయి. రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించడం అంత మంచిది కాదు అని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాయి. అయితే , ఒకవేళ పరీక్షలు పెట్టాలనుకుంటే  విద్యార్థులందరికీ ముందస్తుగా వ్యాక్సిన్ వేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాల్సిందిగా జ్యోతి అగర్వాల్, సంజీవని అగర్వాల్, ప్రదీప్ షెకావత్ అనే ముగ్గురు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్డులో పిటిషన్ దాఖలు చేశారు.

మనదేశంలో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ యువకులపై కూడా దాడి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో  బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీకా వేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు  తెలిపారు. అలాగే అత్యవసర ప్రాతిపదికన విద్యార్థులకు టీకాలు వేయాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఈ పిటిషన్‌ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యార్థులకు వ్యాక్సిన్ వేయడంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది.

ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 2021 ఏడాదికి గాను బోర్డు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వ్యాక్సిన్ వేయడంపై సాధ్యాసాధ్యాలను తెలపాలని అడిగింది. దీంతో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ చైర్మన్ సంతోష్ కె త్రిపాఠి, కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ మోనికా అరోరా హైకోర్టుకు తెలిపారు. అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్లను ఇవ్వవచ్చా, మెడికల్ నిబంధనలు ఏమి చెబుతున్నాయి? వారికి వాక్సిన్ వేయడం సురక్షితమేనా? అనే వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్ల పై బడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మే 1 నుండి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం చెప్పినప్పటికీ , వ్యాక్సిన్ కొరత కారణంగా ఇవ్వడంలేదు.
Tags:    

Similar News