వ్యాక్సిన్ కొర‌తః అమెరికా అధ్యక్షుడికి.. సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో ట్వీట్‌!

Update: 2021-04-16 13:45 GMT
దేశంలో వ్యాక్సిన్ కొర‌త లేనే లేద‌న్న‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే. కానీ.. వాస్త‌వ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో ట్వీట్ తో వెల్ల‌డైంది. వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకును అమెరికా ప్ర‌భుత్వం ఆపేయ‌డంతో.. దేశంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి దారుణంగా ప‌డిపోయిందని స‌మాచారం.

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తుండ‌డంతో.. వ్యాక్సిన్ ఉత్ప‌త్తిలో వేగం పెంచాల్సిన ప‌రిస్థితి ఉంది. కానీ.. ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకుల‌ను అమెరికా ఎప్పుడో నిలిపేసిన‌ట్టు స‌మాచారం. దీంతో.. ఉత్ప‌త్తి క‌నిష్ట స్థాయికి ప‌డిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో.. సీరం సీఈవో అద‌ర్ పూనావాలా ఏకంగా అమెరికా అధ్య‌క్షుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

‘కరోనా వైరస్ ను ఓడించడానికి మనం చేస్తున్న పోరాటం నిజంగా ఐక్యంగా సాగాల‌ని భావిస్తే మాత్రం.. ముడిస‌రుకుల ఎగుమ‌తుల‌పై విధించిన నిషేధాన్ని తొల‌గించాల‌ని కోరుతున్నాను. అప్పుడే టీకాల ఉత్ప‌త్తి పెరుగుతుంది’ అని ట్వీట్ చేశారు పూనావాలా. ఈ విష‌య‌మై గత వారం కూడా సంచ‌ల‌న ట్వీట్ చేశారు. ‘‘స్వయంగా నేనే అమెరికా వెళ్లి అధ్యక్ష భవనం ముందు నిలబడి ాందోళన చేయాలన్నంత ఆవేద‌న‌లో ఉన్నాను’’ అని పోస్టు చేశారు.

ఈ ప‌రిస్థితిపై నెటిజ‌న్లు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని మండిప‌డుతున్నారు. ‌మోడీ ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే.. చివ‌ర‌కు సీరం ఇనిస్టిట్యూటే అమెరికాకు మొర‌పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విమర్శిస్తున్నారు. కేంద్రం మాయ‌మాట‌లు చెబుతూ.. స‌మ‌స్య‌లేద‌ని బుకాయిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి, ఈ స‌మ‌స్య‌పై ప్ర‌ధాని ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News