మరీ అంత పర్సనల్ అవసరమా వర్ల?

Update: 2016-06-03 09:27 GMT
అధినేత పట్ల తమకున్న అభిమానాన్ని ప్రదర్శించే అవకాశం కొన్నిసార్లు వస్తుంది. ఆ అవకాశాన్ని ఎంతలా వాడేసుకుంటారన్నది ఆయా నేతల తెలివి మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా టీడీపీలో అలాంటి అవకాశమే ఒకటి వచ్చింది. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్  తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాదు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు రాళ్లతో కొట్టాలని కూడా పిలుపునిచ్చారు కూడా.

తమ అధినేత మీద ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన జగన్ మీద ఫైర్ అయ్యేందుకు టీడీపీ నేతలు మీడియా ముందుకు క్యూ కడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరిగా.. ఒకరికంటే మిన్నగా మరొకరు అన్న చందంగా జగన్ ను తిట్టిన తిట్టకుండా తిట్టేసే ప్రోగ్రాంను షురూ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ నేత వర్ల రామయ్య ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. జగన్ ను తిట్టే పేరుతో దివంగత వైఎస్ మొదలుకొని.. ఆయన కుటుంబ సభ్యులందరిని తీసుకొచ్చేయటం గమనార్హం.

‘‘తన తండ్రికి సమకాలీకుడైన వ్యక్తి కొడతానని అంటావా? పనికిమాలినవాడా.. మీ నాన్న బతికి ఉంటే ఆయన్ను కూడా కొడతావు. అంతటి పనికిమాలిన వాడివి. స్టుపిడ్ ఫెలో’’ అంటూ తిట్ల దండకాన్ని అందుకున్నారు. అంతలోనే సర్దుకున్న ఆయన.. ఇవన్నీ తాను అంటున్న మాటలు కావని.. తాను చెప్పినవన్నీ జగన్ తల్లి విజయమ్మ తిట్టాల్సిన తిట్లుగా వర్ల వ్యాఖ్యానించటం విశేషం.

చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడే క్రమంలో వర్ల ఆసక్తికర వ్యాఖ్యలు కొన్ని చేసుకొచ్చారు. ఆ మాటల్ని చూస్తే.. ‘‘నీ తల్లిని చెప్పమను. విజయమ్మగారిని చెప్పమను.. నా కొడుకు చేసిన వ్యాఖ్యలు సరైనవేనని. నీ భార్య భారతిని చెప్పమను.. నా భర్త సరిగానే మాట్లాడారని. వారు చెప్పలేరు. నేను అడుగుతున్నా భారతీదేవి.. నీ భర్త మాటల్ని సపోర్ట్ చేస్తారా? నా భర్త సరిగా మాట్లాడారని చెప్పగలరా? ఆమె చెప్పలేరు. నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా? ఇంగితం లేని నువ్వేం నాయకుడివయ్యా బాబు..? నిన్ను ఇంకా తిట్టాలని ఉన్నా ఆ తరహా తిట్లు తిట్టలేను’’ అంటూ వర్ల ఆగ్రహంతో ఊగిపోయారు. ఇన్ని నీతులు చెబుతున్న వర్లకు.. రాజకీయాలకు దూరంగా.. ఇంట్లో ఉండే వారి గురించి ప్రస్తావించకూడదన్న విషయం తెలీదా..?

Tags:    

Similar News