ఒక్క ప్రెస్ మీట్ తో కోపమంతా తీర్చుకున్న వాసిరెడ్డి

Update: 2016-06-30 09:32 GMT
నిన్నటి నుంచి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న వార్తలు తెలిసిందే. తాజాగా రూ.749 కోట్ల ఆస్తుల్ని తాత్కాలిక జఫ్తు చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకోవటం.. ఈ అంశంపై ఏపీ అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈడీ తాజాగా ఆస్తులు జఫ్తు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఎవరికి వారుగా జగన్ ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంటుందన్న తరహాలో వాదనల్ని వినిపిస్తున్న పరిస్థితి.

ఇవన్నీ జగన్ పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపటంతో పాటు.. ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి.  తాజాగా చోటు చేసుకున్న పరిణమాలపై వివరణ ఇవ్వటంతో పాటు తమపై దాడికి దిగుతున్న ఏపీ అధికారపక్ష నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు జగన్ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ  ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ ఆస్తుల అటాచ్ ను సాకుగా తీసుకొని తమపై తప్పుడు ప్రచారం మానుకోవాలంటూ ఆమెసలహా చెప్పారు.

జగన్ మీదున్నకేసుల విషయంలో తుది తీర్పు ఇంకా రావాల్సి ఉందని.. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ‘ముందున్నది ముసళ్ల పండగ’ అంటూ విరుచుకపడ్డారు. ఈడీ నోటీసులు ఇచ్చినంతనే ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు కాదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాభిమానం ఉన్న జగన్ మీద ఆరోపణలు కొట్టుకుపోతాయన్న ధీమాను వాసిరెడ్డి పద్మ వ్యక్తం చేశారు. ఆ మాత్రం ధీమా లేకపోతే.. ప్రెస్ మీట్ పెట్టి ఇన్నేసి మాటలు చెప్పరు కదా?
Tags:    

Similar News