బీజేపీ, కాంగ్రెస్ కు షాకిచ్చాడు..

Update: 2019-02-13 06:07 GMT
బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలపై వరాల వాన కురిపిస్తున్నారు. అలివికానీ హామీలిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటి అమలు సాధ్యమా కాదా అన్నది ఆలోచించకుండా జనాలను ముగ్గులోకి దించి ఓట్లు దండుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

తాజాగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ హామీని ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు తెలిసిన నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.. రాహుల్ ప్రకటన సాధ్యం కాదంటూ తేల్చిపారేశారు. తాజాగా ఆయన ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పథకం అమలు చేసేందుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేదని.. ఈ పథకం అమలు చేసేందుకు అవసరమైన లబ్ధిదారుల పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేదని ఆయన స్పష్టం చేశారు.

‘గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా గరీబీ హఠావోను రాహుల్ పథకం పోలి ఉందని’ రాజీవ్ కుమార్  చెప్పుకొచ్చారు. కనీస ఆదాయ హామీ పథకాన్ని ఎలా అమలు చేస్తారనే విషయాన్ని దేశ ప్రజలకు కాంగ్రెస్ వివరించాలని కోరారు. ప్రజలకు కనీసం ఆదాయం ఇచ్చే కంటే పనిచేసే వ్యక్తులకు మాత్రమే ప్రోత్సాహకాలు అందిస్తే మెరుగైన ఫలితాలుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నదాతల సమస్యలకు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం కాదని ఆయన తేల్చిచెప్పారు.

కనీస ఆదాయ పథకం అమలుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారం మన వద్ద అందుబాటులో లేవని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన పథకం అమలు సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

ఇక బీజేపీ రైతులకు ఇస్తానన్న పీఎం కిసాన్ రైతుబంధు నిధులు కూడా వారి అభ్యున్నతికి తోడ్పడవని.. రైతులను సాధికారికంగా నిలబెట్టేలా మద్దతుధర, పంటకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు నాణ్యంగా ఇవ్వాలని  రాజీవ్ కుమార్ సూచించారు. చైనాలాంటి చాలా దేశాలు కూడా నిరుద్యోగ భృతి కంటే యువతను సాధికారిత వైపు పయనించేలా ప్రోత్సహిస్తున్నాయని  అలాంటివి బీజేపీ చేయాలని సూచించారు.


Tags:    

Similar News