ఎందుకొచ్చారు ? ఎందుకెళ్ళిపోతున్నారు ?

Update: 2022-06-08 06:30 GMT
‘తొందరలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి పార్టీలో చేరుతా’..ఇది మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డి చేసిన ప్రకటన. పార్టీ ఆఫీసులో మంగళవారం నారా లోకేష్ ను కలిసిన ఈ మాజీ ఎంఎల్ఏ టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. జిల్లాలోని రాజకీయ పరిస్ధితులపై సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనే కోరిక తనకు లేదని స్పష్టంచేశారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని మాటిచ్చారు.

వీరశివారెడ్డి చెప్పింది వినటానికి బాగానే ఉందికానీ అసలు వైసీపీలో ఎందుకు చేరారు ? ఇఫుడెందుకని పార్టీని విడిచిపెట్టి మళ్ళీ టీడీపీలో చేరబోతున్నారు ? 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయేనాటికి ఈ మాజీ ఎంఎల్ఏ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు.

అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వెంటనే ప్లేటు ఫిరాయించేసి వైసీపీలో చేరిపోయారు. కారణం ఏమిటంటే కాంట్రాక్టులు, పనులు అవుతాయన్న ఉద్దేశ్యంతోనే శివారెడ్డి వైసీపీలోకి జంప్ చేశారు.

అయితే 151 మంది ఎంఎల్ఏల అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో కడపలో 10కి పది నియోజకవర్గాల్లోను అధికార పార్టీ ఎంఎల్ఏలే ఉన్నారు.  దాంతో ఈ మాజీ ఎంఎల్ఏకి కాంట్రాక్టులు కాదు కదా కనీసం వ్యక్తిగత పనులు కూడా అవుతున్నట్లు లేదు. పైగా ఈయనకు పార్టీలోకానీ నియోజకవర్గంలో కానీ పెద్దగా ప్రాధాన్యత దక్కటం లేదు. దాంతో అనామకంగా వైసీపీలో ఉండిపోవటం ఈయనకు నచ్చినట్లులేదు.

ఫ్యాక్షన్+కాంట్రాక్టర్+పొలిటీషియన్ అయిన శివారెడ్డి లాంటివాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తమ మాటే చెల్లుబాటు కావాలని కోరుకోవటం సహజం.  జగన్ దగ్గర ఈయన మాట చెల్లుబాటు కావటంలేదు. కాబట్టి పార్టీ నేతలు కానీ అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవటం లేదు. అందుకనే ఎంతకాలం వైసీపీలో ఉన్నా వేస్టని అర్ధమైపోయింది. అందుకనే పార్టీ మారిపోదామని డిసైడ్ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే లోకేష్ ను కలిసి పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వ్యక్తిగత లాభం ఆశించిన టీడీపీలో నుండి వైసీపీలో చేరిన శివారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా కొందరున్నారు. వాళ్ళందరి పరిస్ధితి కూడా దాదాపు ఇలాగే ఉంది. వీళ్ళని ఎవరూ వైసీపీలో చేరమని అడగలేదు కాబట్టి ఇఫుడు వెళ్ళిపోతామంటే ఆపేవారు కూడా ఉండరు.
Tags:    

Similar News