బ్రిటీషోడ్ని అలానే అనుకుందామా వెంకయ్యా?

Update: 2017-01-30 18:29 GMT
విశేష అనుభవం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత స్వార్థం కానీ మొత్తంగా కమ్మేస్తే ఎలాంటి మాటలు వస్తాయనటానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటలే పెద్ద ఉదాహరణగా చెప్పాలి. అడ్డదిడ్డంగా మాట్లాడేయటం.. అదేమంటే బెదిరించేయటం ఈ మధ్యన ఆయనకో అలవాటుగా మారింది. చేతిలో అధికారం ఉంటే చాలు ఎవడైనా మారిపోతాడనటానికి వెంకయ్య తీరే నిదర్శనం. ఏదో కొంపలు మునిగిపోయినట్లు.. అదే పనిగా తర్జనభర్జనల మధ్య ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ గురించి చర్చల మీద చర్చలు జరిపి.. చివరకు మమ అనిపించిన ఎపిసోడ్ ను ఆంధ్రాప్రజలు అస్సలు మర్చిపోరు.

ఏ నోటితో అయినా.. ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని చెప్పిన వెంకయ్య అదే నోటితో.. హోదా కాదు ప్యాకేజీ అంటూ నాలుక మడతపెట్టేసి మరీ మాట్లాడేయటం.. అలా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వారిని దబాయించే ధోరణి వెంకయ్యలో అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి వేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తూ.. ప్రత్యేక ప్యాకేజీపై అర్థరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమిటి? అంత హడావుడి ఎందుకు పడ్డారో చెప్పాలని నిలదీశారు.

పవన్ మండిపాటుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో నోరు జారి అడ్డంగా బుక్ అయ్యారు వెంకయ్య.ప్రజలు నిద్రపోయినా 24 గంటలు పాలన కొనసాగిస్తున్నామని చెప్పి తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రకటన ఎప్పుడు చేశామన్నది అసలు సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. వెంకయ్య మాటల్ని విన్నంతనే.. బ్రిటీషోడు ఒక్కసారిగా గుర్తు రాక మానడు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీ మహాత్ముడి పోరాటంతో ఉక్కిరిబిక్కిరి అయి.. ఇక మార్గం లేక దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ.. అర్థరాత్రి వేళ స్వాంత్ర్యం ఇవ్వటం తెలిసిందే. దీన్ని పలువురు తప్పు పడుతూ ఉంటారు.

తాజాగా శ్రీమాన్ వెంకయ్య సాబ్ చెప్పిన ప్రకారమైతే.. బ్రిటీషోడు కూడా ప్రజలంతా నిద్రపోయినా పని చేస్తున్నాడని సరిపుచ్చుకోవాలా? అలాంటి వాదనకు వెంకయ్య ఓకే అంటారా? అన్నది కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఉత్తరాది.. దక్షిణాది అంటూ జనాల్ని రెచ్చగొట్టటం సరికాదంటూ పవన్ పై మండిపడ్డారు వెంకయ్య.

ఒక మాట అంటేనే అంతగా మండిపోతున్న వెంకయ్యకు.. మరి.. దక్షిణాది వారిని చులుకన చేసేలా ఉత్తరాది పాలకుల వ్యవహారశైలి పట్ల జనాలకు ఎంతలా మండాలి? బీహార్ కు లక్ష కోట్లకు పైగా ప్యాకేజీ.. కశ్మీర్ కు ఇదే తరహాలో భారీ ప్యాకేజీ ప్రకటించే మోడీ సర్కారు.. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి ఇంతవరకూ సరైన ప్యాకేజీ ఎందుకు ప్రకటించలేదు. వివక్ష లేకుండా ప్రకటించే వారు కాదా? ఢిల్లీని తలపించే రాజధానిని కట్టుకుందామంటూ మోడీఊరించిన ఊరింపులు ఆంధ్రోడు మర్చిపోలేదు వెంకయ్యా..?
Tags:    

Similar News