ఎంపీల‌యినా చట్టాల‌కు అతీతులు కాదు: వెంక‌య్య నాయుడు హాట్ కామెంట్స్‌!

Update: 2022-08-05 14:30 GMT
ఎంపీల‌యిన‌ప్ప‌టికీ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉండాల్సిందేన‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తేల్చిచెప్పారు. ఎంపీల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉంటే సంబంధిత సంస్థ‌లు స‌మ‌న్లు జారీ చేస్తాయ‌ని.. ఇందులో త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌సరం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇటీవ‌ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ప‌లు కేసుల‌కు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ప‌శ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చ‌ట‌ర్జీ, శివసేన సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ ల‌కు స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరంద‌రినీ ఈడీ విచారించింది. ఈ నేప‌థ్యంలో వెంకయ్య నాయుడి కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఉన్నా కూడా ఎంపీలు సంబంధిత సంస్థ‌ల ఆదేశాల మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరులుగా, చట్టాన్ని, చట్టపరమైన విధానాన్ని గౌరవించేవారిగా ఉండాల‌ని ఉద్భోధించారు. ఈ మేర‌కు వెంక‌య్య నాయుడు ఆగ‌స్టు 5న రాజ్య‌స‌భ‌లో వ్యాఖ్య‌లు చేశారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఈడీ అధికారులు సమన్లను ఇవ్వడం, విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించడాన్ని మ‌ల్లికార్జున ఖ‌ర్గే తప్పు పట్టారు. ఈ నేప‌థ్యంలోనే వెంక‌య్య ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కాగా నిత్యావ‌స‌ర ధరల పెరుగుదల, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ స‌భ‌లో గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సమస్యలపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలను ప్రశ్నిస్తున్న తరుణంలో ఈ నిరసనలు చెల‌రేగాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంజయ్ రౌత్‌ను ఆగస్టు 1 అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేసింది. అలాగే గత నెలలో ఈడీ దాడుల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నేత‌, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ ఉపాధ్యాయుల కుంభ‌కోణంలో దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో ఈడీ 50 కోట్ల రూపాయల నగదు, మ‌రెన్నో లెక్కలోకి రాని ఆస్తులను రికవరీ చేసింది.

కాగా దర్యాప్తు సంస్థల ద్వారా తమ అగ్రనేతలపై జరుగుతున్న విచారణ నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది.
Tags:    

Similar News