ఎవరికి చెప్పాలో వారికే చెబుతానన్న వెంకయ్య

Update: 2019-12-25 06:05 GMT
ఏపీ రాజధానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన.. అనంరతం చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలిసిందే. వికేంద్రీకరణ ద్వారా ఏపీ మరింతగా డెవలప్ అవుతుందన్న వాదన ఒకటైతే.. రైతుల నుంచి 33వేల ఎకరాలు సేకరించి ఇప్పుడు రాజధానిని మారుస్తారా? అన్న అభ్యంతరం ఒకటి. అయితే.. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమంటే.. గత ప్రభుత్వం సేకరించిన 33 వేల ఎకరాల్ని తామేం చేయాలనుకుంటున్నాం? ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాం? లాంటి అంశాలపై సీఎం జగన్ ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. దాని మీద మాట్లాడింది లేదు.

అలాంటప్పుడు లేనిపోని అనుమానాలతో ఏదో జరుగుతుందన్న భయాందోళనలకు గురి కావటంలో అర్థం లేదని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా క్రిష్ణా జిల్లాలోని అత్కూరులో స్వర్ణభారతి ట్రస్టు (వెంకయ్య కుమార్తెకు చెందిన ఎన్జీవో) లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు పలువురు ఆయన్ను కలిశారు. వినతిపత్రం అందించారు.

రాజధాని కోసం33 వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల విషయం తనకు తెలసని.. వారి ఆవేదనను అర్థం చేసుకుంటానని చెప్పారు. చెప్పాల్సిన వారికి చెబుతానని.. రైతులు ఇచ్చిన వినతిపత్రంతో పాటు.. ఈ అంశం మీద తన అభిప్రాయాన్ని కూడా జోడించి చెప్పాల్సిన వారికి చెబుతానన్న వెంకయ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు కొన్ని అంశాల మీద మాట్లాడకూడదన్న ఆయన.. ఎవరికి ఏం చెప్పనున్నారు? అన్నది ప్రశ్నగా మారింది.

ప్రధాని మోడీకి ఏపీ రాజధాని గురించి చెప్పనున్నారా? లేక.. ఈ విషయంలో జగన్ ఐడియాలజీ ఏమిటన్న విషయాన్ని కనుక్కొని.. ఆయనకే సలహా ఇవ్వనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా ఏపీ  సీఎం జగన్ ప్రస్తావించిన మూడు రాజధానుల విషయం మీద పూర్తి వివరాలు బయటకు రాని వేళ.. వెంకయ్య మాత్రం తొందరపడి మాట్లాడలేరుగా? అందుకే నర్మగర్భంగా చెప్పాల్సిన వారికి చెబుతానని చెప్పారా? అన్న మాటలోనే తాను చేయగలిగింది చేస్తానన్న హామీ ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News