జగన్ మారలేదా... వైసీపీలో మధనం అదేనా ?

పార్టీని నడపడం కానీ ప్రభుత్వాన్ని నడపడం కానీ జగన్ కి చేతకావడం లేదని అన్నారు. ఆయన ఒంటెద్దు పోకడల వల్లనే ఇలా జరుగుతోందని అన్నారు.

Update: 2024-10-24 04:30 GMT

వైసీపీకి ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తరువాత అయినా మార్పు ఏ మాత్రం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత వాసిరెడ్డి పద్మావతి విమర్శించారు. పార్టీని వీడి ఇంతవరకూ చాలా మంది నేతలు వెళ్లారు కానీ ఎవరూ చేయని విమర్శలను వాసిరెడ్డి చేశారు. జగన్ లోని చిత్తశుద్ధిని ఆమె ప్రశ్నించారు. పార్టీని నడపడం కానీ ప్రభుత్వాన్ని నడపడం కానీ జగన్ కి చేతకావడం లేదని అన్నారు. ఆయన ఒంటెద్దు పోకడల వల్లనే ఇలా జరుగుతోందని అన్నారు.

జగన్ మారాలని అందరి కోరిక అని ఆయన మారలేదని నాలుగైదు నెలలుగా అది గమనించే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. జగన్ ఇంకా జనాలను పార్టీ జనాలను మభ్యపెడుతున్నారని కూడా ఆమె ఘాటైన వ్యాఖ్యలే చేశారు. అంటే జగన్ లో ఆశించిన మార్పు అయితే లేదని ఆమె అంటున్నారు.

వాసిరెడ్డి బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి డేరింగ్ గా ఇవన్నీ చెప్పారని అంటున్నా పార్టీలో ఉన్న వారి ఆలోచనలూ అవేనా అన్న చర్చ సాగుత్గోంది. జగన్ లో మార్పు కోసమే అంతా చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం వైసీపీ ఓడింది అన్న దాన్ని ఒప్పుకోవడం లేదని పార్టీ సమావేశాల్లో ఆయన అంటున్న మాటలను బట్టి అర్ధం అవుతోంది అంటున్నారు.

టీడీపీ కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలతోనే వైసీపీ ఓడింది తప్ప వైసీపీకి ఓటమి లేదని ఆయన భావనగా ఉందని అంటున్నారు. చంద్రబాబు ఎటూ అన్ని హామీలూ అమలు చేయరు కాబట్టి తిరిగి వైసీపీదే అధికారమని కూడా ఆయన బలంగా నమ్ముతున్నారు అని అంటున్నారు.

అయితే రాజకీయాల్లో చాలా ఉంటాయి. అనేక కోణాలు కూడా ఉంటాయి. చంద్రబాబు తాను ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేసినా చేయకపోయినా ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. దానికి మించి పటిష్టమైన పార్టీ వ్యవస్థ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉంది. మరోసారి ఏపీలో జనసేనను కలుపుకుని ఈ కూటమితోనే ఎన్నికలకు పోవాలన్న ముందు చూపు ఉంది.

మరి ఇన్ని ఉన్న బాబు సులువుగా ఓడుతారు అని జగన్ అనుకుంటున్నారు అన్నది కూడా పార్టీలో చర్చగా ఉంది అని అంటున్నారు. వాసిరెడ్డి చెప్పినది కూడా అదే అంటున్నారు. పార్టీ అంటే ఏ ఒక్కరిదో కాదని అది అందరి కృషి అందరి సహకారంతో సాగేదని, ఒకరి గెలుపు అన్నది పార్టీ మొత్తం కష్టపడితేనే జరుగుతుందని కూడా ఆమె విశ్లేషించారు.

పార్టీని విశ్వసించకుండా పార్టీ వారిని దగ్గరకు తీయకుండా జగన్ చేస్తున్న రాజకీయం నచ్చలేదని ఆమె అంటున్నారు. అయితే వాసిరెడ్డి పార్టీని వీడిపోతూ చేసిన విమర్శలకు ఎంత వరకూ విలువ ఉందని చర్చ కూడా సాగుతోంది. అయిదేళ్ల పాటు జగన్ పార్టీని ప్రభుత్వాన్ని సరిగ్గా నడపకపోతే నాడే ఆమె రాజీనామా చేసి వెళ్లవచ్చు కదా అని అంటున్నారు.

ఇపుడు తాపీగా తప్పులు అన్నీ ఆమెకు కనిపించాయా అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీలో కొంత చర్చగా ఉన్న మాటలనే వాసిరెడ్డి జగన్ మీద విమర్శలుగా చేశారు అని అంటున్నారు. అదే సమయంలో ఆమె తన రాజకీయం కోసం కూడా దారులు వెతుక్కున్నారని అంటున్నారు. వైసీపీలో వాసిరెడ్డి చెప్పినంత దారుణమైన పరిస్థితులు లేకపోయినా జగన్ ఇంకా మారాల్సి ఉందని పార్టీ క్యాడర్ ని లీడర్ ని మరింత దగ్గర చేయాల్సిన అవసరం ఉందని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి వాసిరెడ్డి మిగిలిన వారి కంటే భిన్నంగా జగన్ మీద హాట్ కామెంట్స్ చేసినా అవి ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడేవే అన్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News